Donald Trump: అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య 28 ఏళ్ల మైత్రి బంధం ఉంది. ఏటా ఈ బంధం బలోపేతమవుతూ వస్తోంది. అయితే ఈ మూడు దశాబ్దాల బంధానికి ఒక్క కలం పోటుతో బీటులు వచ్చేలా చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌తో స్నేహం నటించిన ట్రంప్ ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడయ్యాక తన నిజ స్వరూపం బయట పెట్టారు. మనతో కుస్తీ పడుతూ.. దాయది దేశం పాకిస్తాన్‌తో దోస్తీ చేస్తున్నారు. భారత్‌పై 50% సుంకాలు విధించడం, పాకిస్తాన్‌పై కేవలం 19% సుంకాలతో సరిపెట్టడం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసింది. ఈ చర్యలు రష్యా నుంచి చమురు కొనుగోలు, వాణిజ్య లోటు వంటి కారణాలు సాగు కూపినా.. భారత్–పాక్ సంఘర్షణలో ట్రంప్ మధ్యవర్తిత్వం విఫలమైన నేపథ్యంలో వ్యక్తిగత కోపం కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం అమెరికా విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. అమెరికాను పూర్తిగా నమ్మకూడదన్న సందేశం ఇస్తోంది.
వ్యాపారం కోసం పాకిస్తాన్‌తో సానిహిత్యం..
అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్, ట్రంప్ కుటుంబం పాకిస్తాన్‌తో క్రిప్టో వ్యాపార ఒప్పందాల కోసం భారత్‌తో సంబంధాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ట్రంప్ కుటుంబం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ ఒప్పందం, ఇస్లామాబాద్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం కూడా భారత్‌లో అనుమానాలను రేకెత్తించింది. ఈ వ్యాపార ఒప్పందాలు ట్రంప్ విదేశీ విధానంలో వ్యక్తిగత ప్రయోజనాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో స్పష్టం చేస్తున్నాయి. ఇక ట్రంప్ సుంకాల విధానం భారత్‌ను చైనాతో సన్నిహిత సంబంధాల వైపు నెట్టివేస్తోందని సులివన్ హెచ్చరించారు. ఇటీవల భారత్–చైనా సంబంధాలు, 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. చైనా భారత్‌కు ఎరువుల ఎగుమతులపై నిషేధాన్ని సడలించడం, రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారాన్ని విస్తరించేందుకు సంకేతాలు ఇవ్వడం ఈ దిశలో ముందడుగుగా భావించబడుతోంది. ఈ పరిణామాలు అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహంలో వైఫల్యాన్ని సూచిస్తున్నాయి.
దశాబ్దాల బంధానికి బీటలు..
మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్, ట్రంప్ సుంకాల విధానం దశాబ్దాలుగా పాశ్చాత్య దేశాలు భారత్‌ను రష్యా, చైనా నుంచి దూరం చేసేందుకు చేసిన కృషిని విఫలం చేసిందని విమర్శించారు. భారత్‌తో బలమైన సంబంధాలు అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలకు కీలకమని, ట్రంప్ నిర్ణయాలు ఈ సంబంధాలను బలహీనపరిచి, చైనాకు ఆసియాలో ఆధిపత్యం సాధించే అవకాశాన్ని ఇచ్చాయని ఆయన హెచ్చరించారు. ఈ విధానం అమెరికా అంతర్జాతీయ ఖ్యాతిని దెబ్బతీస్తోందని, మిత్ర దేశాలు అమెరికాపై ఆధారపడకుండా స్వతంత్ర విధానాల వైపు మొగ్గేలా చేస్తోందని బోల్టన్ స్పష్టం చేశారు.
సులివన్, బోల్టన్ విమర్శలు అమెరికా యొక్క అంతర్జాతీయ విశ్వసనీయతపై పెరుగుతున్న అనుమానాలను హైలైట్ చేస్తున్నాయి. జర్మనీ, జపాన్, కెనడా వంటి మిత్ర దేశాలు కూడా అమెరికా విధానాలను సందేహంగానే చూస్తున్నాయని సులివన్ పేర్కొన్నారు. ట్రంప్ యొక్క సుంకాల విధానం అమెరికన్ వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచడమే కాక, దీర్ఘకాలికంగా అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.