
సామాన్యులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారమే శాస్త్ర, సాంకేతిక రంగ ప్రయోగాల అంతిమ లక్ష్యం కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బాల్యంనుంచే చిన్నారుల్లో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందింప జేయాలని.. ఆయన సూచించారు. ప్రశ్నలకు జవాబులు చెప్పే విధానానికి బదులు వారిలో ఉత్సుకతను పెంచి ప్రశ్నలు అడిగే తత్వంతో చిన్నారులను ప్రోత్సహించాల్సిన విధానాలను పెంపొందించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘ఆత్మనిర్భరత, ప్రపంచ సంక్షేమంలో సైన్స్ పాత్ర’ అనే అంశంపై.. సీఎస్ఐఆర్, విజ్ఞాన భారతితో పాటు పలు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ ముగింపును పురస్కరించుకుని అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.