Modi Jinping Meeting: నాలుగు సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చైనా గడ్డమీద అడుగు పెట్టారు. గాల్వాన్ ఘటన తర్వాత.. రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేది ముగిసిపోయిన తర్వాత నరేంద్ర మోడీ చైనాలో అడుగుపెట్టడం ఒకరకంగా ప్రపంచ దేశాలకు ఆశ్చర్యంగా అనిపించింది. అమెరికాతో ప్రస్తుతం టారిఫ్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అటు చైనా.. భారత్ పరస్పరం సంప్రదింపులు జరిపిన తర్వాత.. రెండు దేశాల అధినేతలు భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే మన దేశ ప్రధాని డ్రాగన్ దేశంలో అడుగు పెట్టారు.
Also Read: జగన్, కెసిఆర్ సర్వశక్తి సంపన్నులు.. వారిని మన వ్యవస్థలు ఏమీ చేయలేవు
వాస్తవానికి భారత్ చైనా తో వాణిజ్య వ్యవహారాలు కొనసాగిస్తుందని.. తన భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రయాణం సాగిస్తుందని అమెరికా కలలో కూడా ఊహించలేదు. దీని వెనక ఏం జరిగింది.. ఎంత జరిగింది అనే విషయం తెలియదు గానీ.. మొత్తానికి అయితే భారత్ బెట్టు వీడింది. చైనా తలవంచి మైత్రి కోరుకుంది. ఇది ఎంతవరకు వెళుతుంది.. ప్రపంచంపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనే విషయాలను పక్కన పెడితే.. ప్రపంచ పెద్దన్నకు మాత్రం మాత్రం జిన్ పింగ్ , మోడీ భేటీ ఒకరకంగా ఇబ్బంది కలిగించిందని చెప్పవచ్చు. అమెరికన్ మీడియా ఈ భేటీని వేరే కోణంలో చూసింది. అమెరికన్ ప్రయోజనాలకు అనుగుణంగా రకరకాల కథనాలు అల్లుతోంది. ట్రంప్ ఇంతవరకు ఈ భేటీ గురించి మాట్లాడలేదు. అయితే వాణిజ్యం.. ఇతర విషయాలను పక్కనపెడితే రెండు దేశాల అధినేతల మధ్య కీలక చర్చలు జరిగాయి..
సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కోసం ఒప్పందాలు జరిగాయని భారత ప్రధాని పేర్కొన్నారు.. అంతేకాదు కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి మొదలవుతుందని.. రెండు దేశాల మధ్య నేరుగా విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని.. రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రజలకు లబ్ధిని చేకూరుస్తాయని.. వీటివల్ల యావత్ మానవాళికి మంచి జరుగుతుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పరస్పర నమకం.. గౌరవం ఆధారంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ముందుకు వెళ్తాయని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. వాస్తవానికి భారత దేశ అధినేతను డ్రాగన్ ఆహ్వానించినప్పటికీ.. ప్రతి విషయంలోనూ మన దేశ ప్రధాని అప్పర్ హండ్ కొనసాగించారు. ఒకరకంగా అమెరికా ఊహించని విధంగా చైనాతో ఒప్పందాలు చేసుకొని తిరుగులేని షాక్ ఇచ్చారు. వాణిజ్యం అంటే.. ఉత్పత్తులు.. కంపెనీలు.. ఒప్పందాలు మాత్రమే కాదని.. టూరిజం.. రవాణా కూడా అందులో భాగమని భారత ప్రధాని మరోసారి స్పష్టం చేశారు.