Jagan And KCR: ఒక మనిషికి బాధ్యత అనేది ఉంటే కచ్చితంగా భయంతో ఉంటాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి కష్టపడుతూ ఉంటాడు. ఇదే సూత్రం ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రతినిధికి కూడా వర్తిస్తుంది. ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రతినిధి కచ్చితంగా రాజ్యాంగం నిర్దేశించిన సభలకు వెళ్లాల్సి ఉంటుంది. అది శాసనమండలి కావచ్చు.. శాసనసభ కావచ్చు.. దిగువ స్థాయిలో ఉన్న కార్యాలయం కావచ్చు.. అంతిమంగా ప్రజాప్రతినిధి ఆ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఆ ప్రజా ప్రతినిధి ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందే. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అధికారపక్షంలో ఉంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది.
Also Read: రోహిత్, కోహ్లీ లేకుండా 2027 వరల్డ్ కప్ కు టీమిండియానా? అసాధ్యం?
మన దేశ రాజ్యాంగం రూపొందించిన చట్టాల ప్రకారం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజా ప్రతినిధుల పదవి కాలం స్వల్పమే అయినప్పటికీ.. వారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినప్పుడే గొప్ప నాయకులవుతారు. ఇప్పుడంటే పదవి వ్యామోహం వల్ల నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. కానీ ఒకప్పుడు ప్రజలచేత ఎన్నుకోవడమే గొప్ప అవకాశం గా నాయకులు భావించేవారు. ఉదాహరణకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవారు. అదే ” బాబు” ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముదిగొండ కాల్పుల లాంటి సమస్యను వెలుగులోకి తెచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ఇదీ దుస్థితి
ఇప్పటి కాలంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష స్థానాన్ని నాయకులు ఒప్పుకోవడం లేదు. ప్రతిపక్ష స్థానం అంటేనే నాయకులకు ఒక రకమైన ఇరిటేషన్ ఉంటోంది. అప్పటిదాకా అధికారాన్ని అనుభవించిన వారు.. ప్రతిపక్షంలోకి రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు.. పైగా అది తమకు సంబంధం లేని వ్యవహారం అని.. ప్రజలు అనవసరంగా తమల్ని ఓడించారని.. అది ప్రజల కర్మ అని భావిస్తున్నారు. ఏపీలో జగన్.. తెలంగాణలో కేసీఆర్ పై విధానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారి 14 నెలలు పూర్తయింది. ఇంతవరకు జగన్ ఒక రోజు కూడా శాసనసభ సమావేశాలకు వెళ్లలేదు. ఆరు నెలలు దాటితే సభ్యత్వం రద్దవుతుందని తెలిసి జస్ట్ ఒక సంతకం చేసి వెళ్లిపోయారు. వరకు అసెంబ్లీ గుమ్మం కూడా తొక్కలేదు. ఈ లెక్కన చూస్తే వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా వైసిపి అధినేత అసెంబ్లీకి రాడని అర్థమవుతుంది. అసెంబ్లీకి రాకపోయినా సరే ఏడాదికి దాదాపు 16 లక్షల వరకు వేతనాలు.. మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ భద్రత.. ఇతర సదుపాయాలను జగన్ వినియోగించుకుంటూనే ఉన్నారు. కెసిఆర్ కూడా ఏదో ఒకసారి అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోయారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి శాసనసభలో చర్చ జరుగుతుందని తెలిసి.. శాసన సభకు రాకుండా ఉండిపోయారు. ప్రస్తుతం ఆయన ఎరవల్లి వ్యవసాయ క్షేత్రం లేదా నంది నగర్ లోని గృహానికి పరిమితమవుతున్నారు. ప్రభుత్వపరంగా మాజీ ముఖ్యమంత్రి హోదా.. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత.. ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలను దర్జాగా అనుభవిస్తున్నారు.
మన వ్యవస్థలు ఏం చేయగలవు?
ఉన్నత స్థాయి నుంచి మొదలుపెడితే దిగువ స్థాయి వరకు ఉద్యోగులు సకాలంలో కార్యాలయానికి రాకపోతే.. ఒకవేళ అదే పనిగా సెలవులు పెడితే ప్రభుత్వం ఒప్పుకోదు. జీతం ఇవ్వడానికి అంగీకరించదు. ఇక ప్రైవేట్ సంస్థలయితే ఉద్యోగులు ఇలా చేస్తే తీసి అవతలపడేస్తాయి. కానీ జగన్, కెసిఆర్ లాంటి వ్యక్తులకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. వారు శాసనసభకు రాకపోయినా వ్యవస్థలు లేవు. మన చట్టాలు గొప్పవని.. మన వ్యవస్థలు గొప్పవని.. మన విధానాలు అత్యంత పటిష్టమైనవని అనేక సందర్భాల్లో మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ అంతటి వ్యవస్థలు కూడా జగన్, కెసిఆర్ లాంటి వ్యక్తులను శాసనసభ దాక కూడా తీసుకురాలేకపోతున్నాయి.