
గత కొన్ని రోజులుగా జర్నలిస్టులు దారుణ హత్యకు గురవుతున్నారు. గతంలో తమిళనాడులో అక్రమ భూములపై వార్తలు రాశారని జర్నలిస్టును హత్య చేసిన ఘటన మరువకముందే తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలోని బలంపూర్ పట్టణానికి చెందిన రాకేశ్ సింగ్, అతని స్నేహితుడు నిర్బీక్ తో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో కొందరు అగంతకులు ఆ ఇంటికి నిప్పంటించారు. దీంతో వారు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అయితే జర్నలిస్టు కుటుంబ సభ్యలు ఆ సమయంలో వారి బంధువుల ఇంట్లో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సజీవ దహనమైన స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహార చెక్కును అందించింది. అయితే జర్నలిస్టు సజీవ దహనానికి కారణాలపై అన్వేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.