India Russia Relations: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికా, యురోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలు.. రష్యాను భారత్‌కు మరింత దగ్గర చేశాయి. ఆయిల్ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ట్రంప్ ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేయాలని హెచ్చరించారు. భారత్ లెక్కచేయలేదు. దీంతో రష్యా ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించారు. దీంతో రష్యా–భారత్ బంధానికి బ్రేక్ పడిందని ట్రంప్ భావించారు. కానీ అంతర్జాతీయ రాజకీయ వాతావరణంలో మార్పులు వచ్చినా భారత్–రష్యా సంబంధాలు సుస్థిరంగా కొనసాగుతున్నాయి. రష్యన ఆయిల్ ఉత్పత్తిదారులపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, భారత వైఖరి మారలేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ధరల ప్రయోజనాలు, నిత్య సరఫరా భరోసా, వ్యూహాత్మక విశ్వాసం వంటి అంశాలు ఈ ద్వైపాక్షిక బంధానికి బలమైన పునాది వేస్తున్నాయి. భారత పరిశ్రమలు, ప్రత్యేకంగా ఎరువులు, ఇంధన రంగం, లాజిస్టిక్స్ సంస్థలు, రష్యాతో నేరుగా లావాదేవీలు కొనసాగించేందుకు ఆర్థిక వ్యూహాలను రూపొందిస్తున్నాయి. రుపీ–రూబుల్ వాణిజ్య పద్ధతిని పునరుద్ధరించే చర్చలు ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల నిలకడను సూచిస్తోంది.
పెరుగుతున్న రక్షణ సహకారం
డిఫెన్స్ రంగం భారత్–రష్యా బంధానికి మూలస్తంభంగా ఉంది. సుఖోయ్, బ్రహ్మోస్, అణు జలాంతర్గామి ప్రాజెక్టులు లాంటి సహకారాలు ఇప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, స్పేర్‌పార్టుల సరఫరా వంటి అంశాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇది ఆయుధ స్వావలంబన దిశగా భారత లక్ష్యాలకు తోడ్పడుతోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఒత్తిడి తెస్తున్న సమయంలో భారత్ సమతుల్య విధానంతో ముందుకు సాగుతోంది. వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుతూ, ఒక వైపు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో క్వాడ్ ఫ్రేమ్‌వర్క్‌లో భద్రతా మైత్రీని కొనసాగించగా, మరోవైపు రష్యాతో సాంకేతిక, ఇంధన, భద్రతా రంగాలలో సహకారాన్ని నిలుపుకుంటోంది.
రష్యా–భారత్ బంధం ఇప్పుడు కేవలం చరిత్రాత్మక మైత్రి కాకుండా ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక సమీకరణాల్లోనూ సమతుల్యతను కలిగించే శక్తిగా మారింది. మార్చిన గ్లోబల్ బ్యాలెన్స్‌లో భారత్ రష్యాపై ఆధారపడుతూనే, స్వతంత్ర ఆర్థిక స్థావరాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య కూడా రెండు దేశాలు పరస్పర నమ్మకాన్ని కాపాడుతున్న తీరు, బంధం ‘చెక్కుచెదరని’ స్నేహానికి ప్రతీకగా నిలుస్తోంది.