India Afghan Strategic Relationship: దక్షిణ ఆసియా రాజకీయ సమీకరణల్లో భారత్–అఫ్గాన్ సంబంధాలు బలపడుతున్న సందర్భంలో పాకిస్తాన్‌లో భయం రోజు రోజుకూ పెరుగుతోంది. ఆత్మవిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బతిన్న దాయాది దేశంపై భారత్–ఆఫ్గాన్ స్నేహం ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇంతకాలం తమ మిత్రుడు అనుకున్న ఆఫ్గానిస్తాన్ హ్యాండ్ ఇవ్వడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్ ప్రభావం, అఫ్గాన్ మద్దతు కలయికతో ఇస్లామాబాద్‌లో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ భమాన్ని తెలియజేస్తున్నాయి.
Also Read: పటిష్టంగా ఆస్ట్రేలియా.. సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా చేయాల్సింది ఇదే!
భారత్‌కు అస్త్రంగా మారిన ఆఫ్గాన్.,
ఖవాజా ఆసిఫ్ ఓ పాక్ వార్తా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్ ప్రభుత్వం భారత్ ఆధీనంలో ఉందని, కాబూల్ నేరుగా న్యూ ఢిల్లీ సూచనలకే లోబడుతోందని ఆరోపించారు. భారత్ తన ఓటములను దాచిపెట్టడానికి అఫ్గానిస్థాన్‌ను రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతిస్థాపనకు తాలిబాన్ సుముఖంగా ఉన్నా.. భారత ప్రభావంతో చర్చలు నిలిచిపోయాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు పాకిస్తాన్ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్–అఫ్గాన్ వ్యూహాత్మక బంధం..
తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ అఫ్గానిస్థాన్‌తో పరిమిత స్థాయిలో అయినా దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. మానవతా సహాయం, ఔషధ సరఫరాలు, విద్యార్థి వీసాలు లాంటి అంశాల్లో న్యూ ఢిల్లీ అందిస్తున్న సహకారం అఫ్గాన్ ప్రజల్లో విశ్వాసం పెంచింది. దీని ఫలితంగా, భారత్–అఫ్గాన్ మైత్రి ఇప్పుడు వ్యూహాత్మక స్థాయికి ఎదగబోతోంది. ఇదే పాకిస్తాన్‌ను కుదిపేస్తోంది. ఎందుకంటే ఈ సన్నిహితత పాకిస్తాన్‌కు భౌగోళికంగా, భద్రతాపరంగా రెండింటిలో సవాల్‌గా మారుతుంది.
సరిహద్దు ఘర్షణలో చర్చలు విఫలం..
పాకిస్తాన్–అఫ్గాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలకు పరిష్కారంగా తుర్కియేలో పలు రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ అవి విఫలమయ్యాయి. పాక్ ప్రభుత్వం తాలిబాన్‌పై ‘‘ఉగ్రవాదులను అణచడంలో విఫలమైంద’’ని ఆరోపించడం, తాలిబాన్ ప్రతిగా పాక్‌పై ప్రతీకార హెచ్చరికలు చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇరు దేశాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతినడంతో, పాకిస్తాన్ ఇప్పుడు ఆందోళనతో భారత్ పేరు తీస్తూ దృష్టి తప్పించే ప్రయత్నం చేస్తోంది.
యుద్ధభయంలో పాకిస్తాన్
ఖవాజా ఆసిఫ్ చేసిన వాఖ్యలు పాకిస్తాన్ సైన్యానికి ఎదురవుతున్న అంతర్గత ఒత్తడిని ప్రతిబింబిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, అంతర్గత విభజనలు పాక్ ప్రభుత్వాన్ని బలహీనంగా మార్చాయి. ఇలాంటి సమయంలో భారత–అఫ్గాన్ సమీకరణం పాకిస్తాన్ వ్యూహాత్మక పరంగా ముప్పుగా కనిపిస్తోంది. అందుకే భయంతోనే పాకిస్తాన్ నాయకత్వం ‘‘దాడి జరిగితే 50 రెట్లు ప్రతిదాడి చేస్తాం’’ వంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. కానీ వాస్తవంగా ఇస్లామాబాద్ ఇప్పుడు ఆక్రమణకు కాదు, నిలబడటానికే పోరాడుతోంది.
భారత్–అఫ్గాన్ సంబంధాలు స్థిరపడటమే కాకుండా శాంతి, ఆర్థిక ప్రగతికి దోహదం చేసే దిశగా సాగుతున్నాయి. ఈ ద్వైపాక్షిక బంధం బలపడటం పాకిస్తాన్‌కు రాజకీయ, భౌగోళికంగా ఒత్తిడిని పెంచుతున్న వాస్తవం. ఇదే కారణంగా ఖవాజా ఆసిఫ్ లాంటి నేతలు బెదిరింపులు.. ‘‘భయపడుతున్న పాకిస్తాన్’’ చిత్రాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది.