
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మరోసారి రైతుల ఆందోళనపై స్పందించారు. రైతు సోదరుల బాధను తొలగించేందుకు ప్రభుత్వం వేగంగా పరిష్కారం కనుగొనాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్‌లో బాధతో కూడిన చిత్రాన్ని షేర్ చేశారు. ‘నా రైతు సోదరులు పడుతున్న కష్టాలను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్రభుత్వం వెంటనే ఏదో ఒకటి చేయాలి’ అని ట్వీట్ చేశారు. కేంద్రం సెప్టెంబర్‌లో తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గత 16 రోజులుగా దిల్లీ శివారుల్లో శాంతియుత నిరసన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ధర్మేంద్ర కొద్ది రోజుల క్రితం ఈ తరహా ట్వీట్ చేయగా..విమర్శలు వ్యక్తం కావడంతో వెంటనే డిలీట్ చేశారు.