
దేశ రాజధీని ఢిల్లీలోని మాస్కుల తయారీ ఫ్యాక్టరీలో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపారు. తెల్లవారుజామున 3.50 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని, తమకు సమాచారం తెలియగానే ఆరు ఫైర్ ఇంజన్లను అక్కడికి తరలించామని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీలో కొందరు చిక్కకున్నారని తెలియగానే తలుపులు పగులగొట్టి ముగ్గురు వ్యక్తులను రక్షించామని, వారిలో ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నారని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. క్షతగాత్రుడిని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొన్నారు. అతను జుగల్ కిషోర్ గా గుర్తించబడ్డారన్నారు. కాగా ఆసుపత్రిలో అమన్ అన్సారీ, ఫిరోజ్ అన్సారీ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.