
వ్యవసాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం అనేదే తమ ప్రధాన డిమాండ్ అని, అది పూర్తయ్యే వరకు తాము నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. 14 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులను శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదుసార్లు చర్చలు జరిపింది. అయితే, ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. డిసెంబర్ 8న మంగళవారం రాత్రి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి రైతులతో చర్చించారు. కానీ, మూడు చట్టాలు రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో డిసెంబర్ 9న జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. మరోవైపు మూడు చట్టాలు రద్దు చేయడం కాకుండా మధ్యే మార్గంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసింది. చట్టాల్లో 7 సవరణలను ప్రతిపాదించింది. అలాగే, కనీస మద్దతు ధర విషయంలో రాతపూర్వక హామీ ఇస్తామని చెప్పింది.