India Investments: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. ఆ దేశంతో సత్సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ.. అమెరికాకు దూరమవుతున్నాయి. ట్రంప్ అనాలోచిత నిర్ణయాలే ఇందుకు కారణం. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్.. ప్రపంచ దేశాలన్నీ తమ కోసంతో పనిచేయాలన్నట్లు.. తమ కోసం త్యాగాలు చేయాలన్నట్లు.. తమ కోసం పన్నులు భరించాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీకార సుంకాల పేరుతో అమెరికాతో వ్యాపారం చేసే దేశాల ఉత్పత్తులపై ట్యాక్స్‌లు విధిస్తున్నారు. దీంతో అనేక దేశాలు ఇప్పటికే అమెరికాపై ఆగ్రహంతో ఉన్నాయి. తాజాగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య, సాంకేతిక, రాజకీయ ఉద్రిక్తలు పెరుగుతున్నాయి. దీంతో అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు తమ ఉత్పాదన కేంద్రాలను ఇతర దేశాలకు మార్చడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ సందర్భంలో, భారతదేశం అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానంగా కనిపిస్తోంది. భారతదేశంలో యువ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, పెరుగుతున్న మార్కెట్ సామర్థ్యం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. దీంతో యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు ఈ అవకాశాన్ని గుర్తించి, భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి మొగ్గు చూపుతున్నాయి.
Also Read: రాహుల్ గాంధీ అరెస్ట్.. ఢిల్లీలో ఏం జరుగుతోంది..
నోయిడాలో యాపిల్ ప్లాంట్..
ఆపిల్ కంపెనీ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో 300 ఎకరాల స్థలంలో కొత్త ఉత్పాదన కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చర్య భారతదేశంలో యాపిల్ పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్లాంట్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఇక్కడ తయారు చేయనుంది. ఇది చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, భారతదేశాన్ని గ్లోబల్ సప్లయ్ చైన్‌లో కీలక కేంద్రంగా మార్చే దిశగా ఒక అడుగు.
యువతకు ఉద్యోగ అవకాశాలు..
యాపిల్ ఈ కొత్త ప్లాంట్ భారత ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. గ్రేటర్ నోయిడా ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా సాంకేతిక, ఇంజనీరింగ్, తయారీ రంగాలలో నైపుణ్యం కలిగిన వారికి. అదనంగా సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, సేవల రంగాలు కూడా ఈ పెట్టుబడి ద్వారా లాభపడతాయి.
ఆకర్షణగా భారత ప్రభుత్వ విధానాలు..
భారత ప్రభుత్వం ‘‘మేక్ ఇన్ ఇండియా’’, ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ వంటి కార్యక్రమాలు విదేశీ కంపెనీలను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్పాదన రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి పన్ను సంబంధిత ప్రోత్సాహకాలు, సులభతరమైన వ్యాపార నిబంధనలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివి యాపిల్ వంటి సంస్థలకు భారత్‌లో పెట్టుబడి పెట్టేలా ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రేటర్ నోయిడా ప్రాంతంలో పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేస్తోంది. ఈ చర్యలు ఇతర బహుళజాతి సంస్థలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. యాపిల్ బాటలోనే చైనాలోని అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా భారత్ బాట పడతాయని కేంద్రం భావిస్తోంది.