China 80th Victory Parade: అమెరికా టారిఫ్‌ల వేళ.. చైనా భారత్ సంబంధాలు కాస్త మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఇరు దేశాల ప్రతినిధుల రాకపోకలు, చర్చలు మొదలయ్యాయి. ఈనెల 31న భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా చైనాకు వెళ్లబోతున్నారు. అక్కడ నిర్వహించే షాంగై కోఆపరేటివ్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. మొత్తంగా సానుకూల వాతావరణం పెంపొందుతున్న తరుణంలో చైనా తన బుద్ధి కుక్కతోక చందమే అని నిరూపించుకుంది. చైనా–పాకిస్థాన్ సన్నిహిత సంబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 3 చైనా నిర్వహించనున్న 80వ విక్టరీ పరేడ్‌కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా 26 దేశాధినేతలకు ఆహ్వానం పంపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం ఆహ్వానించకపోవడం గమనార్హం.
చైనా విక్టరీ పరేడ్: షెహబాజ్‌కు ఆహ్వానం..
చైనా జపాన్‌పై 1945లో సాధించిన విజయాన్ని స్మరించేందుకు నిర్వహించే 80వ విక్టరీ పరేడ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సహా 26 దేశాధినేతలు పాల్గొంటారు. భారత్‌కు ఆహ్వానం లేకపోవడం 2020 గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా–భారత సంబంధాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తుంది.
ఎస్‌సీవో సమావేశానికి మోదీ..
ఇదిలా ఉంటే.. ఆగస్టు 31–సెప్టెంబర్ 1న టియాంజిన్‌లో జరిగే షాంగై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో మోదీ, పుతిన్, షెహబాజ్ షరీఫ్‌తో సహా 20 దేశాధినేతలు పాల్గొంటారని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమావేశం ఎస్‌సీవో చరిత్రలో అతిపెద్దదిగా నిర్వహితం కానుంది. చైనా దౌత్యపరమైన ప్రభావాన్ని విస్తరించే ప్రయత్నంగా భావిస్తున్నారు. మోదీ, షెహబాజ్ ఒకే వేదికపై ఉండనున్న నేపథ్యంలో, భారత్–పాక్ సంబంధాలపై చర్చ ఊపందుకుంది.
భారత్‌పై ఆర్థిక ఒత్తిడి..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత ఉత్పత్తులపై 50% టారిఫ్స్ విధించారు, ఇవి ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల 48 బిలియన్ డాలర్ల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టెక్స్‌టైల్స్, ఆభరణాలు, లెదర్ వంటి శ్రామిక–ఆధారిత రంగాలు తీవ్రంగా నష్టపోనున్నాయి, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ తరుణంలో చైనా–పాకిస్తాన్ మధ్య బలమైన సంబంధాలు, ముఖ్యంగా చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ రెండో దశ ప్రారంభం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్–చైనా కారిడార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లడం భారత సార్వభౌమత్వ ఆందోళనలను పెంచుతోంది. ఇదిలా ఉంటే ఎస్‌సీవో సమావేశంలో అమెరికా టారిఫ్స్‌ను ఖండించే అవకాశం ఉంది, ఇది భారత్‌కు దౌత్యపరమైన మద్దతు సమకూర్చవచ్చు.
మోదీ ఎస్‌సీవో సమావేశంలో భారత ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను గట్టిగా వినిపించనున్నారు. చైనా–పాక్ సహకారం, అమెరికా టారిఫ్స్ నేపథ్యంలో, భారత్ యూరోప్, ఆసియా మార్కెట్లలో ఎగుమతులను విస్తరించేందుకు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు వ్యూహాత్మకంగా కృషి చేయాల్సి ఉంది.