
సుదూర గ్రామాల్లో శ్రమిస్తున్న అన్నదాతలతో సంబంధం ఉన్న వ్యవసాయంపై ఢిల్లీలో కూర్చుని నిర్ణయాలు చేయలేరని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉన్న వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించకుండా పార్లమెంట్‌లో తనకు ఉన్న సంఖ్యాబలంతో ఆమోదించి, బలవంతంగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన రెండో నెలలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు ఐదు దఫాలు చర్చించినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ముగ్గురు మంత్రులతో కేంద్రం నియమించిన కమిటీపై శరద్ పవార్ సందేహాలు వ్యక్తం చేశారు.