Wrestlers Protest : 40 కేసులున్న హైలెవల్ గూండా, ఖూనీకోరు, కబ్జాదారు, రేపిస్టు నుండి తమని కాపాడమని చేతులు జోడించి డిల్లీ నడివీధుల్లో క్రీడాకారులు వేడుకొంటూంటే, కుస్తీ సమాఖ్య అధ్యక్షుడిగా, ఎంపీ నుండి కనీసం పక్కన పెట్టలేని వ్యవస్థ అదే ఆడపిల్లల మీద ఎప్పుడో మతమార్పిడి జరిగిందని ఎక్కడో దక్షిణాది మూలన రాష్ట్రం మీద ఒక కథ అల్లి సినిమా తీసి, పన్ను మినహాయింపులిచ్చి మరీ సినిమా చూపిస్తుంది.
రౌడీలు, గుండాలంటూ లక్ష్యంగా చేసుకుని ఎన్‌కౌంటర్లు చేయించే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే రాష్ట్రంలోని 40 కేసులున్న సదరు ఎంపీ మీద ఈగకూడా వాలకుండా కాపాడుకుంటుంది. ఇదేం న్యాయమో ఆ పార్టీనే చెప్పాలి.
అక్కడేవున్న ఈ దేశపు సర్వోన్నత న్యాయస్థానం చేష్టలుడిగి చూస్తూ వుంటుంది. నీతిలేని మీడియా గురించైతే చెప్పాల్సిన పనేలేదు.
ఇదే క్రీడాకారులు పథకాలు తెచ్చినప్పుడు జబ్బలు చరుచుకుని దేశానికి గర్వం అన్నాం, వాళ్లమీద సినిమాలు తీసినప్పుడు సిటీలు కొట్టి చూశాం. అదే ఆడపిల్లలు రోడ్లమీద కన్నీళ్లు పెట్టుకుంటుంటే సానుభూతి అటుంచి నాటకాలుగా కొట్టేసేంతగా మనలో మనిషితనం చచ్చిపోయింది.