Karnataka CM : కర్ణాటక కొత్త సీఎం ఎవరు?

డిప్యూటీ సీఎం పదవి ఒప్పుకోను.. మొదటి రెండున్నరేళ్లు నేనే సీఎం అంటూ డీకే శివకుమార్ సీఎం పదవి కోసం టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఫార్ములాపై కసరత్తు చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది.

Written By: NARESH, Updated On : May 17, 2023 7:49 pm
Follow us on

Karnataka CM : కర్ణాటకలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. మే 13న స్పష్టమైన మెజారిటీతో గెలుపొందినప్పటి నుంచి ఇక్కడ సీఎం కుర్చీ పోరు కొనసాగుతోంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. కానీ సీఎం పదవికి ఇద్దరు ప్రధాన అభ్యర్థులైన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఒప్పందం కుదరలేదు. కర్ణాటక సీఎం రేసులో ఉన్న ఇరువురు నేతలు బుధవారం రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ తర్వాత కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేటికి నాలుగో రోజు కూడా సీఎం ప్రకటన చేయలేకపోయారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ.. సీఎం పదవి కోసం చర్చ జరుగుతున్నదని, త త్వరలో పేరు ప్రకటిస్తామని వెల్లడించారు.

సీఎం కుర్చీ కోసం గొడవల మధ్య సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బుధవారం రాహుల్ గాంధీని కలిశారు . ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. రాహుల్ కంటే ముందే ఇద్దరు నేతలు మల్లికార్జున్ ఖర్గేను కూడా కలిశారు. అయితే ఈ సమావేశాల తర్వాత కూడా అధికార పంపిణీ ఫార్ములాపై ఏకాభిప్రాయం కుదరలేదు.

డిప్యూటీ సీఎం పదవి ఒప్పుకోను.. మొదటి రెండున్నరేళ్లు నేనే సీఎం అంటూ డీకే శివకుమార్ సీఎం పదవి కోసం టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఫార్ములాపై కసరత్తు చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, మరో రెండున్నరేళ్లు డీకే శివకుమార్. అయితే మొదటి రెండున్నరేళ్లు తననే ముఖ్యమంత్రిని చేయాలంటూ డీకే శివకుమార్ పట్టు వీడడం లేదు.

ఇంతకుముందు డిప్యూటీ సీఎం ఫార్ములా కూడా విఫలమైంది. డిప్యూటీ సీఎం ప్రతిపాదనను డీకే శివకుమార్‌ తిరస్కరించారు. ఢిల్లీలోని తన సోదరుడు, ఎంపీ డీకే సురేష్ నివాసంలో డీకే శివకుమార్ పార్టీ నేతలు, వారి మద్దతుదారులతో చర్చించారు.

తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో కొత్త సీఎం పేరును పార్టీ ప్రకటిస్తుందని తెలిపారు. 48-72 గంటల్లో కర్ణాటకలో కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని చెప్పారు.

దీంతో కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరు అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. సీఎంగా సిద్ధు ఎంపిక దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు. కానీ సీఎం పోస్ట్ ఖరారు కాలేదన్న ప్రచారంతో వీటన్నింటికి తెరపడింది.