కరోనా లాక్‌డౌన్‌తో దేశంలో ఆర్థిక పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి.. మరెందరి ఉద్యోగాలు పోయాయి. దీంతో చాలా వరకు ఫ్యామిలీలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈఎంఐలు కట్టలేని దుస్థితి. కిరాయి ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ఈ ఇబ్బందులను గుర్తించిన కేంద్రం, ఆర్బీఐ ఫైనాన్షియల్ సమస్యల నుంచి కొంత రిలీఫ్ ఇస్తూ గత మార్చిలో మారటోరియం పెట్టారు. ఆర్బీఐ మారటోరియం ఇచ్చినా లోన్ అమౌంట్‌పై వడ్డీల మీద వడ్డీ విధించింది. లోన్ టెన్నర్‌తోపాటే అదనపు వడ్డీల భారం మోపింది.
Also Read : తెలంగాణ లంచావతారుల మీద అనకొండలు
మారటోరియం కాలంలో వేసిన వడ్డీ మాఫీపై పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రుణగ్రహీతలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆ సందర్భంలో సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. తాజాగా.. రుణాలపై కేంద్రం, ఆర్బీఐ నిర్ణయాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. అన్ని రంగాల రుణాలు, రుణగ్రహీతల అంశాలపై కేంద్రం, ఆర్బీఐ చర్చించాలని ఆదేశించింది. చర్చల సారాంశంతో అఫిడవిట్ దాఖలు చేయాలంది. అఫిడవిట్ దాఖలుకు రెండు వారాల గడువిచ్చింది.
సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉండగా, వడ్డీ మాఫీకి వ్యతిరేకమంటూ రిజర్వు బ్యాంకు మీడియా ద్వారా లీకులు ఇచ్చింది. దీనిపైనా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పద్ధతులు పునరావృతం కావ్వొద్దని హెచ్చరించింది. బలవంతంగా వడ్డీలను మాఫీ చేయించడం సరికాదని, బ్యాంకుల మనుగడ ప్రమాదంలో పడుతుందని రిజర్వు బ్యాంకు అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే.. వడ్డీ మాఫీ భారం రూ.2.1 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించింది. ఈఎంఐలపై వడ్డీని మాఫీ చేయడమనేది ఆర్థిక సూత్రాలకు విరుద్ధమని కేంద్రం, ఆర్బీఐ తరఫున తుషార్ మెహతా ఇప్పటికే సుప్రీంకు స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ రూపొందించిన అఫిడవిట్‌ను ధర్మాసనానికి సమర్పించారు. మారటోరియం సమయంలో వాయిదాల మీద వడ్డీ విధించాలనేదే కేంద్రం యోచన అని ఆయన తెలిపారు.
మారటోరియం కాలంలో విధించిన వడ్డీ మాఫీ చేసే అవకాశాలపై సుప్రీం కోర్టు జూన్‌లో ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని కోరింది. మారటోరియం కాలానికి వడ్డీ మాఫీ లేదా వడ్డీపై వడ్డీ మాఫీ అనే రెండు అంశాలు తమ పరిశీలనకు వచ్చినట్లు తెలిపింది. ఒక పక్క మారటోరియం ప్రకటించి, వడ్డీ వసూలు చేయడం తీవ్రమైన విషయమని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 27న ఆర్‌బీఐ ప్రకటించిన మారటోరియంలో రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయడం మారటోరియానికే విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సూచించిన వడ్డీ మాఫీ/వడ్డీపై వడ్డీ మాఫీ అంశాలను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
Also Read : సర్కార్ దమనీతిపై బీజేపీ–జనసేన ధర్మపోరాటం