HomeజాతీయంManipur Controversy : అసలు మణిపూర్ లో ఏం జరుగుతోంది? నగ్నంగా మహిళలను ఎందుకు ఊరేగించారు?...

Manipur Controversy : అసలు మణిపూర్ లో ఏం జరుగుతోంది? నగ్నంగా మహిళలను ఎందుకు ఊరేగించారు? వివాదమేంటి?

Manipur Controversy : పచ్చని మణిపూర్ తగలబడుతోంది. గత రెండున్నర నెలల నుంచి కాల్పులు, హత్యలతో నెత్తుటి ధార కారుతోంది. అక్కడి పరిస్థితులు నానాటికి హింసాత్మకంగా మారుతుండడంతో ప్రభుత్వం ఏకంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. ఇదే సమయంలో అక్కడ పలు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నప్పటికీ బయట ప్రపంచానికి అంతగా తెలియడం లేదు. అయితే తాజాగా బుధవారం ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం, వారిపై దాడి చేయడం సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అక్కడ అధికార పార్టీపై విమర్శల దాడిని పెంచాయి. అక్కడి బిజెపి ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రావణ కాష్టం లాగా రగులుతున్న మణిపూర్ వివాదానికి అసలు కారణమేమిటంటే?

షెడ్యూల్ తెగ హోదా కల్పించాలి
మణిపూర్ రాష్ట్రంలో మెయిటీ తెగకు చెందిన జనాభా 53% ఉంటుంది. వీరు తమకు షెడ్యూల్ తెగల హోదా కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనిని స్థానిక గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేస్తున్న డిమాండ్ పై నాలుగు వారాలుగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. పైగా రాష్ట్ర జనాభాలో 53% ఉన్న వీరు కేవలం 10 శాతం భూమిలో మాత్రమే ఉంటున్నారు. అయితే రాష్ట్ర శాసనసభలో వీరు మూడింట రెండు వంతుల మంది ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 40 శాతం మంది ఉన్న గిరిజనులు 90 శాతం భూమిలో ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా ఇక్కడికి వస్తున్నారని, వారు ఎస్టీ హోదా కోరుతున్నారని మెయిటీలు ఆరోపిస్తున్నారు.. అయితే వారికి ఎస్టి హోదా కల్పిస్తే భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను, ఉద్యోగ అవకాశాలను కోల్పోతామని కుకీలు ఆందోళన చెందుతున్నారు. అందుకే వారిని ఎస్టీ హోదాలో కలపాలనే డిమాండ్ ను వ్యతిరేకిస్తున్నారు. మణిపురి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన విషయాన్ని మెయిటీల వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. మెయిటీలలో కొన్ని వర్గాలకు ఇప్పటికే ఎస్సీ, హోదా ఉందని చెబుతున్నారు. అంతే కాదు లోయలోని ప్రజాప్రతినిధులు గతంలోనే బహిరంగంగానే మెయిటీలకు మద్దతు పలికారు. రాష్ట్రంలోని భూమిలో అత్యధిక భాగం కొండ ప్రాంత జిల్లాలోనే ఉంది. ఇక్కడ గిరిజనులు ఉంటున్నారు. ఇక్కడ నాగాలు, కుకీలు ఉన్నారు.. మీరు ప్రధానంగా క్రైస్తవ మతంలో ఉన్నారు.
కుకీల వాదన ఏంటంటే?
అయితే మణిపూర్ రాష్ట్రంలో వివిధ చట్టాలు ఇక్కడి భూమిని ఇతరులు ఆక్రమించుకోకుండా రక్షణ కల్పిస్తున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలో చట్టబద్ధంగా నివసిస్తున్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయిస్తోందని కుకీలు ఆరోపిస్తున్నారు. అధికరణ 371సీ ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ అధికరణ ప్రకారం కొండ ప్రాంతాలకు పరిపాలనపరమైన స్వయం ప్రతిపత్తి ఉందని చెబుతున్నారు. మరోవైపు దీనిపై ప్రభుత్వం కూడా ఘాటుగానే స్పందిస్తోంది. రిజర్వ్ ఫారెస్ట్ ను ఆక్రమించుకున్న వారిని మాత్రమే ఖాళీ చేయిస్తున్నామని చెబుతోంది. రిజర్వ్ ఫారెస్ట్ ను గంజాయి తోటల పెంపకం, మాదకద్రవ్యాల వ్యాపారం కోసమే వాడుకుంటున్నారని, అలాంటి వారిని ఖాళీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. అయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట విద్వేషాగ్ని రాజుకుంటూనే ఉంది. వాస్తవానికి దశాబ్దాలుగా ఆదివాసీయేతర మెయిటీలకు, కుకీలు, నాగాలకు దూరం ఉంది. మెయిటీలకు ఎస్టి హోదా కల్పించడమే ఈ వివాదానికి కారణం. ఈ రాష్ట్రాన్ని బిజెపి ప్రభుత్వం పాలిస్తోంది. అది మెయిటీల పక్షాన ఉంటోంది. కుకీలు, నాగాల విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఏడది మార్చిలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీరేన్ సింగ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు ఆదివాసుల్లో అవిశ్వాసానికి కారణమవుతున్నాయి. వారి ఆధీనంలో ఉన్న అటవీ భూములను ఫారెస్ట్ గా మార్చేందుకు ప్రయత్నించడం, వారి గ్రామాలను అక్రమమైనవిగా ప్రకటించడం, రాష్ట్రంలో ఎన్ ఆర్ సి అమలు చేయాలని అనుకోవడం ఆదివాసులను ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా బుధవారం ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి ఊరేగించడం మణిపూర్ ను మరింత మంటల్లోకి నెట్టింది.
అభివృద్ధికి దూరం
కొండ ప్రాంతాలకు చెందిన కుకీ, నాగాలు దశాబ్దల కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్నట్టు అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో 60 మంది ఎమ్మెల్యేలు 40 మంది మెయిటీ లే ఉన్నారు. ముఖ్యమంత్రులుగా రెండు దశాబ్దాల నుంచి రాష్ట్రాన్ని వారే పరిపాలిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనూ వారిదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో తమకు ఎస్టి హోదా కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడం పట్ల మెయిటీలు ఏకంగా హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వ ఆదివాసీ మంత్రిత్వ శాఖ మెయిటీలకు అనుకూలమైన వైఖరి ప్రదర్శించడం ఆదివాసుల భయాన్ని మరింత పెంచింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మెయిటీలకు ఎస్టి హోదా కట్టబెట్టే దిశగా అడుగులు వేస్తున్నాడంతో ఆదివాసులు దీనికి నిరసనగా మే మూడున ఒక సదస్సు నిర్వహించారు. వారిపై మెయిటీలు దాడులు చేశారు. ఈ ఘటనలో వందలాది చర్చిలు దహనం కావడం వివాదానికి కారణమైంది. వేలాదిమంది నివాసాలు వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటిదాకా మణిపూర్ రాష్ట్రం రావణకాష్టం లాగా రగిలి పోతూనే ఉంది. దీనికి అటుకట వేసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular