Kohli : ఇంతలోనే ఎంత మార్పూ..?!! భారత క్రికెట్లోనే కాదు.. కోహ్లీకి ప్రపంచ క్రికెట్లోనూ తిరుగులేదంటూ.. మాజీలు, తాజాలు కురిపించిన ప్రశంసలు ఇంకా అభిమానుల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన విరాట్ ను తలదన్నే వీరుడు లేడంటూ ఇచ్చిన కితాబులు.. మతాబుల్లా వెలిగిన సందర్భాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఆ విధంగా.. ఎవరెస్టు స్థాయికి ఎదిగిన కోహ్లీ.. ఊహించని రీతిలో అథః పాతాళానికి పడిపోవడం అభిమానులను వేధిస్తే.. దిగ్గజాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ధోనీలా తనంతట తానుగా కెప్టెన్సీ వదులుకునే వరకూ కొనసాగుతాడని భావిస్తే.. బీసీసీఐ తొలంగించే పరిస్థితి రావడం అవమానకరంగా భావిస్తున్నారు చాలా మంది. మరి, దీన్ని కోహ్లీ ఎలా తీసుకుంటాడన్నదే ఇప్పుడు చర్చ.

అండర్-19 జట్టు కెప్టెన్ గా.. వరల్డ్ కప్ సాధించినప్పుడే.. అందరి దృష్టిలో పడ్డాడు కోహ్లీ. జాతీయ జట్టుకు భవిష్యత్ ఆశాకిరణం అని భావించినట్టుగానే.. వేగంగా జట్టులోకి వచ్చి, అద్భుతమైన ఆట తీరుతో అలరించాడు. తనదైన బ్యాటింగ్ తో ప్రపంచంలోనే మేటి బ్యాటర్ గా ఎదిగాడు. ఇప్పటి వరకు 70 సెంచరీలు బాదాడు. ఇక, తిరుగులేదు అని భావిస్తున్న సమయంలోనే.. ఊహించని విధంగా కెప్టెన్సీ వచ్చింది. 2014లో ఆస్ట్రేలియా టూర్లో ధోనీ అర్థంతరంగా పగ్గాలు వదులుకోవడంతో.. స్వీకరించిన కోహ్లీ.. అప్పటి నుంచీ తన హవా కొనసాగించాడు.
మొత్తం మూడు ఫార్మాట్లలోనూ ఏకైక కెప్టెన్ గా ఉన్న కోహ్లీ.. మెరుగైన రికార్డుతో సత్తా చాటాడు. 66 టెస్టుల్లో 39 విజయాలు సాధించి, భారత క్రికెట్లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా నిలిచాడు. ఇక, వన్డేల్లో 95 మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించిన కోహ్లీ.. 65 విజయాలు సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 50 మ్యాచ్ లకు కెప్టెన్ గా ఉండి.. 30 విజయాలు సాధించి పెట్టాడు. ఇలా.. మెరుగైన ఘనతతోనే కోహ్లీ.. ముందుకు సాగాడు. ఇవేమీ సాధారణ విజయాలు కాదు. కానీ.. సమస్య ఎక్కడంటే.. కోహ్లీ బ్యాటింగ్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతూ వస్తోంది. గడిచిన రెండేళ్లుగా.. ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
ఇదే కాకుండా మరికొన్ని మైనస్ లు ఉన్నాయి. ఇప్పటి వరకూ కోహ్లీ.. ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. చివరకు ఐపీఎల్ కప్పునూ సొంతం చేసుకోలేకపోయాడు. ఇవి పెద్ద ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. వీటికితోడు.. బ్యాటింగ్ వైఫల్యం మరింత ఇబ్బందిగా మారింది. టీ20 ప్రపంచ కప్ కు ముందే.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు రావడంతో.. రాజీనామా ప్రకటించాడు. అయితే.. వరల్డ్ కప్ లో ఘోర పరాజయం పాలవడంతో పరిస్థితి మరింత దారుణందా తయారైంది. టీ20 బాధ్యతలు రోహిత్ అందుకున్నాడు. కానీ.. వన్డే కెప్టెన్సీ కూడా ఇంత త్వరగా ఊడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు.
మరి, ఇప్పుడు కోహ్లీ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ధోనీ కెప్టెన్సీ అప్పగించేసి, ఎలాంటి బేషజాలూ లేకుండా విరాట్ కు సహకరించాడు. మరి, కోహ్లీ కూడా అలాగే చేస్తాడా? జట్టు సభ్యుడిగా ఉండగలడా? అన్నది ఆసక్తికర అంశంగా మారింది. నిజానికి.. అలా చేస్తేనే హుందాగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. తిరిగి బ్యాటింగ్ పై ఫోకస్ చేయడానికీ ఉపకరిస్తుందని అంటున్నారు. లేదంటే.. కెరియరే ప్రమాదంలో పడే పరిస్థితి రావొచ్చని అంటున్నారు. మరి, కోహ్లీ ఏం చేస్తాడు? మరో ధోనీ అవుతాడా? లేదా? అన్నది చూడాలి.