Vijay: కరూర్ ప్రాంతంలో జరిగిన విషాదానికి సంబంధించి టీవీకే విజయ్ ఆలస్యంగా నైనా తనవైఖరిని వెల్లడించారు. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు.. వాస్తవానికి విజయ్ కరూర్ ప్రాంతంలో తొక్కిసలాట జరిగిన తర్వాత అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయారు. ఆయన వెళ్లిపోయిన నేపథ్యంలో అధికార డీఎంకే పార్టీ నేతలు విమర్శలు చేశారు. ఒక మంత్రి ఏకంగా కన్నీరు కూడా పెట్టారు. అంతమంది వెళ్లకూడదని చెప్తే విన్నారా అంటూ బాధపడ్డారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా జరిగిన ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించడం.. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం ప్రకటించడం వంటి సంఘటనలు వెంటవెంటనే జరిగిపోయాయి. దీంతో సహజంగానే టీవీ కే పార్టీ మీద ఒత్తిడి పెరిగిపోయింది. మీడియాలో ప్రధానంగా కథనాలు ప్రసారం కావడంతో అన్ని వేళ్ళూ విజయ్ వైపు చూపించడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఒక రకంగా ఆత్మ రక్షణ ధోరణిలో పడిపోయారు. ఆయన పార్టీ కార్యకర్తలు కూడా నిశ్శబ్దంగా ఉండి పోయారు.
ఉన్నట్టుండి విజయ్ ఒక్కసారిగా సెల్ఫీ వీడియోలో కనిపించారు. కరూర్ ఘటన ఎలా జరిగింది.. ఎందుకు జరిగింది.. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో విజయ్ మాట్లాడారు. స్టాలిన్ ప్రభుత్వం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు.. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతోనే ఇంతటి దారుణం జరిగిందని పేర్కొన్నారు. ఆ సమయానికి అంబులెన్సులు అక్కడినుంచి పంపించారని.. ఇది కావాలని చేసిన కుట్ర అని విజయ్ మండిపడ్డారు.. విజయ్ చేసిన ఆరోపణలు తమిళనాడులోనే కాదు, జాతీయ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించాయి. సరికొత్త చర్చకు కారణమయ్యాయి.
అవసరమైతే తనపై ప్రతీకారం తీర్చుకోవాలి గాని.. అభిమానుల జోలికి అసలు వెళ్ళకూడదని విజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తొక్కిసలాట వెనుక తమిళనాడు ప్రభుత్వం ఉందనేవిధంగా విజయ్ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. వాస్తవానికి ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్రంలో విజయ్ బల ప్రదర్శన వల్లే తొక్కిసలాట జరిగిందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అదేవిధంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే విజయ్ విడుదల చేసిన వీడియో తర్వాత ఘటన జరిగిన తీరు మరోవైపు టర్న్ తీసుకుంది. దీని వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయని టీవీకే నేతలు ఆరోపించడం సరికొత్త చర్చకు కారణమవుతోంది. అయితే దీనిపై డిఎంకె నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏకంగా 40 కి మందికి పైగా చావుకు కారణమైన విజయ్ ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేసిందని.. తమిళనాడు చరిత్రలో ఈ తరహాలో ఎన్నడు దారుణం జరగలేదని.. విజయ్ జరిగిన తప్పుకు ప్రజల నుంచి క్షమాపణలు కోరకుండా.. ఇలా వితండవాదం చేయడం ఏంటని డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంతవరకు నోరు మెదపలేదు. డీఎంకే నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఘటన జరిగిన నాడు ముఖ్యమంత్రి వేగంగా స్పందించారు. విచారణకు ఆదేశించారు. 10 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇంతవరకు ఈ ఘటనపై ముఖ్యమంత్రి మాట్లాడింది లేదు. అయితే విజయ్ మాట్లాడిన తర్వాత జరిగిన దారుణానికి ప్రభుత్వమే కారణమని టీవీకే నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. డీఎంకే లో కిందిస్థాయి నాయకులు తప్ప.. పై స్థాయి నాయకులు ఈ విషయంపై ఇంతవరకు మాట్లాడటం లేదు. వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. అంతేకాదు అడ్డగోలుగా విమర్శలు చేయకూడదని ఇప్పటికే నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో డీఎంకే నేతలు తమ ఓటు బ్యాంకు చీలిపోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.