
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2021 సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు డ్రైవింగ్ లైసెన్స్ గడువును పొడిగించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పర్మిట్ల గడువును పొడిగించింది.
2020 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీతో గడువు ముగిసిన సర్టిఫికెట్లకు 2021 మార్చి వరకు గడువును పొడిగించారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు డైరెక్టరీ విడుదలైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే ఈ మేరకు ఆదేశాలు అందాయి. దేశంలో చాలామంది వాహనదారులు కరోనా విజృంభణ నేపథ్యంలో లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల గడువును పొడిగించుకోలేకపోయారు.
కేంద్రం ఇప్పటివరకు ఈ విధంగా నాలుగుసార్లు గడువును పొడిగించింది. 2021 మార్చి నెల చివరి వారంలో పరిస్థితులను బట్టి లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల గడువు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే అధికారులు మాత్రం కేంద్రం మరోసారి గడువును పొడిగించే అవకాశాలు ఐతే లేవని చెబుతున్నారు. సర్టిఫికెట్లను రెన్యువల్ చేసుకోవడం కోసం గత కొన్నిరోజుల నుంచి వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
అయితే ఎక్కువ సంఖ్యలో వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు వస్తే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో కేంద్రం లైసెన్స్, ఇతర సర్టిఫికెట్ల గడువును పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురించి వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.