Kerala: ఒక్కో ఇల్లు ఇంద్ర భవనం లాగా ఉంటుంది. ఫర్నిచర్, ఇతరత్రా వర్క్ కళ్ళు చదివేలా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎంత లేదన్నా రెండు నుంచి మూడు కోట్ల వరకు ధర పలుకుతుంది. ఇలాంటి ఇల్లు కేవలం పాతిక లక్షల లోపే వస్తుందంటే ఎవరైనా ఏం చేస్తారు? యురేకా అంటూ ఎగిరి గంతేసి కొనేస్తారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. సంవత్సరాలకు సంవత్సరాలు హౌస్ ఫర్ సేల్ అని బోర్డుపెట్టినా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఆ ఇళ్ళు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. లంకంత కొంపలు ఖాళీగా ఉండటంతో స్మశాన నిశ్శబ్దం ఆవరిస్తోంది. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడో అమెరికాలోనో, యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్ దేశంలో కాదు. దేవ భూమిగా, పర్యాటక స్వర్గముగా పేరుగాంచిన కేరళలో..
ఇంతకీ ఏం జరిగిందంటే..
కేరళ తెలుసు కదా.. దేశంలోనే అధిక అక్షరాస్యత కలిగిన రెండవ రాష్ట్రం. చదువుకున్న యువత మొత్తం ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడం, అక్కడ భారీగా సంపాదించి డబ్బులను ఇండియాకు పంపడంతో వారి తల్లిదండ్రులు అద్భుతమైన గృహాలు నిర్మించారు. ఒక సర్వే సంస్థ అంచనా ప్రకారం ఒక్కో ఇల్లు దాదాపు కోటి పైచిలుకు ఉంటుంది.. విదేశాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటం, తమ జీవిత భాగస్వాములు కూడా అక్కడ స్థిరపడేందుకే మొగ్గు చూపడంతో కేరళ వాసులు అక్కడే ఉంటున్నారు. దుబాయ్, అరబ్ దేశాలు, బహ్రెయిన్ లాంటి దేశాల్లో స్థిరపడ్డారు. అక్కడి కరెన్సీ మన దేశంతో పోల్చితే అధికం కావడంతో అక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నారు. 1950లో క్యాథలిక్ సమూహానికి చెందిన క్రైస్తవులు అరబ్ దేశాలకు వెళ్లడం ప్రారంభించారు. అప్పటినుంచి మొదలైన ఈ వలస ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.
11% ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి
కేరళలోని కడతుర్తి, ఉజ్వుర్, కరీం కున్నం, పదినంతిట్ట, కుంభ నాడు, సెంట్రల్ కేరళ, కొట్టాయం లోని అది చిరాకు ప్రాంతాల్లో దాదాపు 11% ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.6% ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో 6,03,146 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఆ సంఖ్య 11,89,144 ఇళ్ళు ఖాళీగా ఉన్నట్టు ఒక అంచనా. ఉద్యోగాలు, విద్య, ఉపాధి కోసం పెరుగుతున్న వలసల దృష్ట్యా ఇంకా ఈ ఇళ్ళు మరిన్ని ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదాహరణకు పదనం తిట్ట జిల్లాలోని కోయిపురం పంచాయతీలో 11,156 ఇళ్ళల్లో 2,886 మూత పడినట్టు తెలుస్తోంది.
ఇంటి నుంచి ఒక్కరయినా….
కుంభ నాడు పంచాయతీలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. ఫలితంగా ఆ గ్రామం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. దీంతో అక్కడి ఇళ్ళు మూసివేసి కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల నుంచి ఇళ్ళు మూసివేసి ఉన్నందున ప్రభుత్వం తాజా బడ్జెట్లో వాటిపై పన్ను విధించే ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే ఎన్నారైల నుంచి విమర్శలు రావడంతో దానిని ఉపసంహరించుకుంది. ఈ స్థాయిలో పరిస్థితి ఉంటే మరో 50 ఏళ్లలో కేరళ రాష్ట్రంలో ఎవరూ ఉండరని క్యాథలిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిఏ బాబు చెబుతున్నారు.” నా ముగ్గురు పిల్లలు మూడు దేశాల్లో స్థిరపడ్డారు. మాతో కలిసి జీవించేందుకు వారు ఇష్టపడటం లేదు. మా గ్రామంలో చాలా మంది పరిస్థితి ఇదే. ఇక తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి చేరుకుంటే వారిని తమతో పాటు తీసుకెళ్తారు. మంచాన పడి ఉంటే వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు” ఇలా వారి జీవితం వృద్ధాశ్రమంలో ముగుస్తుందని అతడు ఆవేదనంగా చెప్పాడు. కేరళ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో దాదాపు పరిస్థితి ఇలాగే ఉంది. దేవ భూమిగా ప్రసిద్ధి చెందిన ఆ రాష్ట్రం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం నిజంగా బాధాకరమే.