National Flag: మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయ్యాయి. దీంతో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పటికి 75 ఏళ్లు పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం. ఆగస్టు 8 నుంచి 15 వరకు దేశంలోని అన్ని ఇళ్లపైన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నాం. మన జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నట్లు తెలుస్తోంది. మనకు గౌరవం తీసుకొచ్చే జాతీయ పతాకాన్ని మనం కూడా అంతే స్థాయిలో గౌరవించాల్సి ఉంటుంది.

మన జాతీయ పతాకాన్ని తల కిందులుగా వేలాడదీయకూడదు. ఎప్పుడు కూడా నేలను తాకరాదు. నేలపై పడేయకూడదు. ఇంకా దుస్తులుగా ఉపయోగించకూడదు. తోరణాలుగా కట్టకూడదు. జాతీయ పతాకానికి ఎలాంటి భంగపాటు కలిగించినా శిక్షార్హులు. దీనికి భారతీయ శిక్షాస్మృతి లో ఉన్న చట్టం ప్రకారం జాతీయ పతాకాన్ని ఎగురవేయడంలో మనం కచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే. జాతీయ పతాకం ఎగురవేసినప్పుడు దాని కన్నా ఎత్తులో ఎలాంటి గుర్తు ఎగురకూడదు.
కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి ప్రతీక. దేశ శ్రేయస్సు ఇందులో ఇమిడి ఉంటుంది. ఇక తెలుపు రంగు శాంతికి చిహ్నం కావడంతో మనం ఇప్పుడు కూడా శాంతియుతంగానే నడుచుకోవడం గమనార్హం. ఆకుపచ్చ రంగు ప్రకృతికి మనకు విడదీయరాని సంబంధం ఉందని తెలియజేసే చిహ్నం. దీంతో జాతీయ రంగులో ఉండే ఈ మూడు రంగులే మనకు దారి చూపే మార్గాలు. మన జాతి కోసం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య రూపొందించిన చిహ్నమే మన జాతీయ పతాకం. అందుకే మన జాతీయ పతాకాన్ని ఎల్లప్పుడు గౌరవించుకోవడం మన విధి.
మన జాతీయ పతాకం చిహ్నం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, స్పీకర్, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్, కలెక్టర్ ల వాహనాల మీద ఉంచుతారు. అది వారి పదవికి మనం ఇచ్చే గౌరవం. మన జాతీయ పతాకాన్ని నిరంతరం కూడా మన ఇంటి మీద ఎగురవేసుకోవచ్చు. కాకపోతే దానికి ఎలాంటి అడ్డు తగిలే ఇతర జెండాలు ఉండకూడదు. పాశ్చాత్య దేశాల్లో వారి జాతీయ చిహ్నాన్ని ఎగురవేసుకోవడం చూస్తుంటాం. అలాంటి అర్హత మనకు కూడా ఉంది.

జాతీయ జెండాను అవమాన పరిస్తే మూడు సంవత్సరాల జైలు, జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండు శిక్షలు కూడా పడొచ్చు. మన జాతీయ పతాకాన్ని తోరణంగా వాడకూడదు. అలంకరణ వస్తువుగా కూడా వినియోగించరాదు. అలా చేస్తే శిక్షార్హులవుతారు. 1971 నిబంధన ప్రకారం జాతీయ జెండాను అవమానిస్తే వారిపై కేసు నమోదు చేయవచ్చు. కాగితం రూపంలో ఉన్న జాతీయ జెండాలను నేలపై పడేయరాదు. జెండా నేలను తాకితే అవమానించినట్లే. దీంతో మన జాతీయ పతాకాన్ని మనం గౌరవించుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
జాతీయ జెండాలను ఎక్కువ కాలం అలాగే ఉంచితే అవి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జెండా ఆవిష్కరణ తరువాత సాయంత్రం 5 గంటల తరువాత తీసి భద్రపరచుకోవాలి. అంతే కాని అలాగే ఉంచితే జెండా కలర్ పోయి అందవికారంగా కనిపించే ప్రమాదం పొంచి ఉంది. అందుకే జాతీయ జెండా ఎప్పుడు కూడా పాడు కాకుండా చూసుకోవాలి. జాతీయ జెండాను తొక్కడం, ధ్వంసం చేయడం, కాల్చడం వంటివి చేస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వారు కచ్చితంగా శిక్షార్హులవుతారు.