Jagan- Chandrababu: ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వైరం నడుస్తోంది. వ్యక్తిగత ఆరోపణలు, చివరకు కుటుంబసభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసేదాకా పరిస్థితులు దారితీస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దూషణల పర్వం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తమిళనాడు తరహాలో రివేంజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. విశేషమేమిటంటే తమిళనాడులో మాత్రం ఆ తరహా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడ్డాయి. స్టాలిన్ సీఎం అయిన తరువాత అక్కడ కొంతవరకూ మార్పులు వచ్చాయి. విపక్ష నేతలను వ్యక్తిగతంగా కలవడం, గత ప్రభుత్వాలు ప్రారంభించిన మంచి పథకాలను కొనసాగించడం, విపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు తగ్గడం వంటి కారణాలతో అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. అయితే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. రాజకీయ వైరం పక్కకు తప్పి వ్యక్తిగత పగల వరకూ పరిస్థితులు దాపురించాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటలు, పలకరింపులు సైతం కరువయ్యాయి. శుభాకాంక్షలు, పరామర్శల పరిస్థితి వచ్చినప్పుడు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సాధనాలకు మాత్రమే పనిచెబుతున్నారు. ముఖాముఖీగా కలవడానికి మాత్రం ఇష్టపడడం లేదు.

ముక్తసరి పలకరింపులు..
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సీఎం జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎస్ సమీర్ శర్మ,డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలతో పాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్, చంద్రబాబులు ముక్తసరిగా పలకరించుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకూ శాసనసభలో తప్పించి వారిద్దరూ వేదిక పంచుకున్న సందర్భాలు లేవు. చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమాలను జగన్ అవాయిడ్ చేసిన సందర్భాలున్నాయి. అయితే తొలిసారిగా ఎట్ హోమ్ లో కలుసుకున్న వీరు మాట్లాడుకున్న సందర్భం రాలేదని అక్కడున్నవారు చెబుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు హాజరైన కార్యక్రమంలో వారిద్దరూ వ్యక్తిగతంగా మాట్లాడుకునే సందర్భం రాలేదు. అందుకే ముక్తసరి పలకరింపునకే పరిమితమైనట్టు తెలుస్తోంది.
కలిసిన దాఖలాలు లేవు..
సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకునే సందర్భాలు చాలావరకూ వచ్చాయి. కానీ ఇద్దరూ కలిసిన దాఖలాలులేవు. ఒకరు హాజరైతే మరొకరు గైర్హాజరయ్యేవారు. ప్రధాని మోదీ భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చారు. అప్పట్లో చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందింది. కానీ ఆయన తన పార్టీ ప్రతినిధిగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పంపించారు. అటు తరువాత ఆజాదీ కా అమృత్ మహోత్సవాలకు సీఎం జగన్ తో పాటు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కానీ చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. జగన్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో జగన్ ఢిల్లీలో ఉన్నా అక్కడకు వెళ్లలేదు. ఆ మరుసటి రోజు నీతి ఆయోగ్ సమీక్షకు హాజరయ్యారు. కేవలం చంద్రబాబు హాజరైనందు వల్లే జగన్ డుమ్మా కొట్టారని అంతా భావించారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినది, స్వాతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ కలవాల్సి వచ్చింది.

నాడు ఆహ్లాదకర వాతావరణం..
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతీ కార్యక్రమానికి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ఆహ్వానం అందేది. రాజకీయాలను పక్కన పెట్టి ఇద్దరూ కార్యక్రమానికి హాజరయ్యే వారు. వారు పాల్గొనే కార్యక్రమం ఒకరకమైన మంచి వాతావరణాన్ని తలపించేది. కానీ చంద్రబాబు సీఎం అయిన తరువా విపక్ష నేతగా జగన్ ఉన్నారు. వీరి మధ్య రాజకీయ వైరం వ్యక్తిగతంగా మారిపోయింది. నాడు జగన్ శాసన సభను బహిష్కరించగా.. నేడు చంద్రబాబు సైతం బహిష్కరణ బాట పట్టారు. కనీసం వేదికలు పంచుకునేందుకు సైతం ఇష్టపడడం లేదు. ఇటువంటి సమయంలో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో కలపడం విశేషం.