Target to Win General Election : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాలక, ప్రతిపక్ష కూటములు కీలక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కర్నాటకలో ఘన విజయం స్ఫూర్తితో బీజేపీని 2024 ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ ఇతర పక్షాలు బెంగళూరులో భేటీ అయ్యాయి. వరుసగా రెండు రోజుల పాటు మేథోమథనం చేశాయి. బీజేపీని ఓడించడానికి ఉన్నఏ అవకాశాన్ని జార విడుచుకోకూడదని నిర్ణయించాయి. కూటమికి సరికొత్త పేరు పెట్టి యుద్ధానికి సిద్ధం కావాలని డిసైడయ్యాయి. అదే సమయంలో మోదీ నాయకత్వంలో 2024 ఎన్నికల్లో హ్యట్రిక్ కొట్టాలని బీజేపీ స్ట్రాంగ్ గా డిసైడయ్యింది. ప్రతిపక్షాలను చీల్చడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరికొద్ది గంటల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభం కానుంది.
బెంగళూరులో జరిగిన యూపీఏ మిత్రపక్షాల సమావేశం తొలిరోజు సక్సెస్ ఫుల్ గా నడిచింది. కర్నాటకలో విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ఆతిథ్యం ఇచ్చింది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పశ్చిమబెంగాల్, బిహార్, ఢిల్లీ, తమిళనాడు సీఎంలు మమతాబెనర్జి, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ తో పాటు వామపక్షాల అగ్రనాయకులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.
అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి మరింత స్ట్రాంగ్ గా ముందుకెళ్లాలని డిసైడయ్యింది. ఎన్నికలకు ముందే 20 లక్షల మందితో భారీ కవాతుకు నిర్ణయించింది. అటు యూపీఏ పేరు మార్పుపై కూడా ఫోకస్ పెంచింది. విపక్షాల ఐక్యతకు అర్ధం వచ్చేలా.. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు పేరు పెట్టాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. కూటమి పేరు, దాని సారధి, రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వంటి వాటిపై స్పష్టమైన ప్రణాళిక దిశగా అడుగులు వేస్తోంది. అన్నింటికీ మించి దేశంలో రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు సంకేతాలు ఇచ్చేలా కీలక ప్రకటనలు, ప్రచారాలపై ఫోకస్ పెంచాలని డిసైడయ్యింది.
విపక్షాల ప్రయత్నాలను గండి కొట్టాలని బీజేపీ భావిస్తోంది. వాటికి మించి భాగస్వామ్య పక్షాలను రెడీ చేస్తోంది. అయితే ఈ పార్టీలన్నీ ఐదు శాతం లోపు ఓటు బ్యాంకు ఉన్నవే కావడం గమనార్హం. దీని వెనుక మోదీ, షా ద్వయం వ్యూహం తెలియజేస్తోంది. మొన్నటివరకూ బీజేపీకి సానుకూలత కనిపించింది. కానీ కర్నాటక ఎన్నికల తరువాత ఒక రకమైన అనుమానాలు ప్రారంభమయ్యాయి. అందుకే చిన్నాచితకా పార్టీలను ఏకం చేసి ముందస్తుగా ఉంచుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాయి. ఓట్లు, సీట్లు తగ్గినా.. చిన్నపార్టీల మద్దతుతో గట్టెక్కవచ్చన్నదే బీజేపీ అభిమతంగా తెలుస్తోంది. మొత్తానికైతే వైరి పక్షాలు యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి.