Tomato Prices Increase: దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు మండుతున్నాయి. సామాన్యులకు అందకుండా పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, ఆయిల్, పప్పులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇలా వీటి రేట్లు భారీగా పెరగ్గా.. ఇప్పుడు టమాటా వంతొచ్చింది. పెట్రోల్ ధరను మించి టమాటా రేటు పెరుగుతూ పోతోంది. దేశంలో ఏ నగరాల్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
చర్చంతా టమాటా గురించే..
ఇప్పుడు దేశవ్యాప్తంగా టమాటా ధరల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. నిన్న మొన్నటి వరకు కిలో రూ.10, రూ.20, రూ.30 వరకు దొరికిన కేజీ టమాటా ఇప్పుడు సెంచరీ దాటి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల కిలో రూ.150 మార్కు కూడా దాటింది.
వంటింట్లో కనిపించని టమాటా..
ఇప్పటికే గ్యాస్, ఆయిల్, పప్పులు, పెట్రోల్, కరెంట్ బిల్లులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు.. ఇప్పుడు మరో పెద్ద తలనొప్పి మొదలైంది. సాధారణంగా వంటింట్లో టమాటా నిత్యావసర కూరగాయ. కానీ ఇప్పుడు కనిపించడం లేదు. రోజూ వినియోగించే టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతలా పెరగడంతో జనం కొనడమే మానేశారు.
వైరల్ అవుతున్న మీమ్స్..
ఇదే సమయంలో టమాటా ధరల పెరుగుతలపై మీమర్లు కూడా తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. నెట్టింట మీమ్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. టమాటా ధరల్ని బంగారంతో పోలుస్తుండటం గమనార్హం. దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల మహబూబాబాద్ మార్కెట్‌లో టమాట ఎత్తుకెళ్లగా, కర్ణాటకలో అయితే తోటనే దోచేశారు.
పెట్రో ధరను మించి..
ఇక ఇప్పుడు చాలా వరకు కేజీ టమాటా రూ.100 దాటి .. ఆయా నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లను మించి అమ్ముడవుతుండటం గమనార్హం.
– ఢిల్లీలో పెట్రోల్ రేట్లు వరుసగా లీటర్‌కు రూ. 106.31, రూ.96.72 వద్ద ఉండగా.. మెట్రో నగరాల్లో టమాటా కేజీకి రూ.140 పలుకుతుంది.
– ముంబయిలో లీటర్ పెట్రోల్ రేటు రూ.106.31గా ఉండగా.. కిలో టమాటా రూ.110 పైనే పలుకుతోంది.
– బెంగళూరులో టమాటా రేట్లు కేజీకి రూ.100 పలుకుతుండగా.. పెట్రోల్ రేట్లు అక్కడ లీటరకు రూ.101.94 వద్ద ఉన్నాయి.
– హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు లీటర్‌కు రూ.110 వరకు ఉండగా.. టమాటా రేటు ఇక్కడ కాస్త తక్కువే (కిలోకు రూ.100 వరకు) ఉన్నట్లు తెలుస్తోంది.
– కోల్‌కతాలో అత్యధికంగా టమాటా కేజీకి రూ.160 వరకు ఉండగా.. పెట్రోల్ రేట్లు ఇక్కడ లీటర్‌కు రూ.106.03 వద్ద ఉంది.
– చెన్నైలో పెట్రోల్ రేట్లు లీటర్‌కు రూ.102.63 కాగా.. టమాటా కేజీకి రూ.117–120 మధ్య ఉంది.
– మొరాదాబాద్‌లో కిలో టమాటా రేటు రూ.150 వద్ద ఉండగా.. పెట్రోల్ రేటు రూ.96.83 గా ఉంది.
– తిరువనంతపురంలో పెట్రోల్ ధర రూ.109.71 ఉండగా టమాటా రూ.130 పలుకుతోంది.
– పాండిచ్చేరిలో పెట్రోల్ ధర రూ.96.14 ఉండగా, టమాటా ధర రూ.100 ఉంది.
– సిక్కిం రాజధాని గాంగ్‌టక్‌లో పెట్రోల్ ధర రూ.102.55 ఉండగా, టమాటా రూ.130 పలుకుతోంది.
– బీహార్ రాజధాని పాట్నాటలో పెట్రోల్ రేటు 107.25 ఉండగా, టమాటా మాత్రం రూ.120 పలుకుతోంది.