Jagan On Volunteers: వలంటీర్లు నిమిత్తమాత్రులే.. నడిపిస్తోంది జగన్ సర్కారు

జగన్ సర్కారు అధికారంలోకి రాగానే సమాంతర రాజకీయ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. వారికి రూ.5 వేలు వేతనం అందిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 11, 2023 10:10 am

Jagan On Volunteers

Follow us on

Jagan On Volunteers: స్వచ్ఛంద సేవకుడ్ని వలంటీరు అంటారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలకు ముందుకొచ్చే వాడికే ఆ పేరుతో పిలుస్తారు. అటువంటి అభిమతం ఉన్నవారినే వలంటీర్లుగా నియమించుకుంటారు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తున్న రెండున్నర లక్షల మంది వలంటీర్లు సేవాభావంతో ముందుకొచ్చారా? వారి నియామకానికి తీసుకున్న కొలమానం ఏమిటి? రాజకీయాలకు అతీతంగా సేవలందిస్తున్నారా? అధికార పార్టీ ప్రమేయం లేకుండా వ్యవహరిస్తున్నారా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. అదో రాజకీయ సమాంతర వ్యవస్థ. ఈ విషయాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులే స్వయంగా ప్రకటించిన సందర్భాలున్నాయి.

వలంటీర్లు అధికార పార్టీ మనుషులు, సేవ ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. నియమించిన వారు… వారే అయితే వారి మాట వినక.. మరెవరి మాట వింటారు? అయితే ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ వలంటీర్ల వ్యవస్థలో లోపాలు మాట్లాడేసరికి నానా యాగీ చేస్తున్నారు. తమ ప్రతాపం ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ వారు రాజకీయాలే చేయలేదన్నట్టు వలంటీర్లు చెబుతున్నారు. అదే జరిగితే అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏకపక్ష విజయాలు సాధ్యమా? వారి ప్రచారం ప్రతి ఇంటి గోడ వినింది. వారి హెచ్చరికలు జనాలు కళ్లలో కనిపించాయి.

జగన్ సర్కారు అధికారంలోకి రాగానే సమాంతర రాజకీయ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమించారు. వారికి రూ.5 వేలు వేతనం అందిస్తున్నారు. ఇందులో 90 శాతం మంది అధికార పార్టీకి చెందిన వారేనని స్వయంగా నియామక ప్రక్రియ చూసిన విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఎవరైనా తోక జాడిస్తే వలంటీర్ల నుంచి తొలగిస్తామని మంత్రులు వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనలు వైరల్ అయ్యాయి. ఎవరెన్ని చెప్పినా.. శ్రీరంగనీతులు వల్లిస్తున్నా వలంటీర్లు వైసీపీ ప్రచారకర్తలుగా ఉన్నారని ప్రజలకు తెలుసు. ఎన్నికల ప్రచారం నుంచి సీఎం పర్యటనల వరకూ ప్రజలను సమీకరించేది కూడా వలంటీర్లే. చివరకు ప్రజలు ఏ పార్టీకి చెందిన వారు.. వైసీపీకి విభేదిస్తున్నదెవరూ అన్నది మ్యాపింగ్ చేస్తున్నది కూడా వారే.

వలంటీర్లు నిమిత్తమాత్రులే. నడిపిస్తోంది మాత్రం వైసీపీ సర్కారు. అందుకే పవన్ ఒక భయంకరమైన వ్యవస్థగా పేర్కొన్నారు. పవన్ ఆరోపణలు చేసింది రూ.5 వేలు తీసుకునే వలంటీరు మీద కాదు. ప్రభుత్వం చేసే దాష్టీకాలకు మార్గం చూపుతున్న వలంటీరు వ్యవస్థపైనే. ప్రభుత్వం ఎలాంటి దుర్మార్గపు చర్యలకు దిగాలన్న వలంటీరు వ్యవస్థనే ఎంచుకుంటోంది. చివరకు తన పత్రిక సర్వ్యూలేషన్ పెంచుకోవాలన్న వారిద్వారానే. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా? రెండున్నర లక్షల సర్వ్యూలేషన్ నగదును ఇచ్చినట్టే ఇచ్చి తన ఖాతాలో వేసుకుంటోంది. దీనిపై ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టుకు ఏపీ సర్కారు సమాధానం ఇవ్వలేదు. కానీ స్వచ్ఛమైన వలంటీరు వ్యవస్థపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాగి గులివింద గింజ మాదిరిగా ఉంది.