BJP in Telugu states: ఊరంతా ఆనందం.. కానీ మన ఇంట్లో లేదు అన్నట్టు ఉంది తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యవహారం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ పార్టీ హవా చాటుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో( North India) పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి రాగలుగుతోంది. కానీ దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి ఎంత మాత్రం మెరుగుపడడం లేదు. మిత్రుల సాయంతో పర్వాలేదనిపిస్తోంది. కానీ సొంతంగా ఎదగాలన్న క్రమంలో చతికల పడుతోంది. బిజెపికి మాత్రమే ఎందుకు ఈ పరిస్థితి అనేది ఒక వాదన. నాయకుల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమన్నట్టు విశ్లేషణలు ఉన్నాయి. బీహార్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించడంతోపాటు ఎన్డీఏ తిరుగులేని విజయం సాధించడంతో.. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ ప్రారంభం అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకెప్పుడూ సంబరాలు అని ఎక్కువమంది పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
ఇప్పట్లో నో ఛాన్స్..
ఏపీలో( Andhra Pradesh) బిజెపి అభివృద్ధి అనేది ఇప్పట్లో జరిగే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలం పెరగడం లేదు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ బలమైన రెండు ప్రాంతీయ పార్టీలు హవా చూపిస్తున్నాయి. వాస్తవానికి టిడిపి ఆవిర్భావ సమయానికి ఏపీలో బిజెపి ఎంట్రీ ఇచ్చింది. విశాఖలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 1982లోనే బిజెపి విజయం సాధించింది. కానీ తరువాత సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయలేదు. బిజెపి విధానాలు ఏపీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. జాతీయస్థాయిలో బిజెపి అవసరార్థం ఏపీలో ఉన్న రాజకీయ పొత్తులతో బిజెపిని గెలిపించాయే తప్పించి.. బిజెపి సొంతంగా ఎదిగిన దాఖలాలు మాత్రం ఏపీలో లేవు. 2019 ఎన్నికల్లో కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. 2024లో తెలుగుదేశం, జనసేనతో జతకట్టడంతో 8 ఎమ్మెల్యే సీట్లు, మూడు ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ ప్రాతినిధ్యం పెంచుకుంది. 2029 ఎన్నికల్లో ఇదే పొత్తు కొనసాగితే పరవాలేదు కానీ.. పొత్తు లేకుంటే మాత్రం ఒక్క సీటు కూడా బిజెపి గెలిచే అవకాశం లేదు.
తెలంగాణలో ఆదరణ దక్కినా..
ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో ( Telangana) బిజెపి అభివృద్ధికి చాలా రకాల అవకాశాలు వచ్చాయి. అక్కడి ప్రజలు బిజెపిని ఆదరించారు కూడా. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పటినుంచి తెలంగాణలో బిజెపి అభివృద్ధి కావడం ప్రారంభం అయింది. క్రమేపీ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది. అయితే 2023లో కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నాటి నుంచి బిజెపి ఎదగడం ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్ష పాత్రను బిజెపి పోషించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బిఆర్ఎస్ స్థానంలో బిజెపి వచ్చి చేరిందని విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ తెలంగాణ బిజెపిలో నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీ బలహీన పడింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా బిజెపికి రాలేదు. అదే సమయంలో కెసిఆర్ పార్టీ తన బలాన్ని పెంచుకుంది. రెండో స్థానంలో నిలిచింది. అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ బిజెపి విఫలం అయింది.
రెండు చోట్ల విరుద్ధం..
ఏపీలో ఎదిగే ప్రయత్నం జరగడం లేదు. తెలంగాణలో ఎదిగిన తరువాత పార్టీ బలహీనం అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో పార్టీ అభివృద్ధి అనేది కూడా జరగదు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ లో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఆ కారణం చేత ఏపీలో టిడిపిని కాదని బిజెపిని మరింత బలపరిచే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో కెసిఆర్ పార్టీని కాపాడేందుకు బిజెపి తనను తాను తగ్గించుకుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ తో బిజెపి చేతులు కలిపిందన్న మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. బిజెపికి ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. మొత్తానికి అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగడం అన్నది ఇప్పట్లో జరిగే పని మాత్రం కాదు.