Unemployment Rate: భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. అదే సమయంలో యువత ఎక్కువగా ఉన్న దేశం. అయితే అందరికీ ఉద్యోగం, ఉపాధి కల్పన ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నాయి. ఇటీవలే నిరుద్యోగ సమస్యలతో బంగ్లాదేశ్, నేపాల్‌లో సంక్షోభాలు తలెత్తాయి. ఆయా దేశాల జనాభా 10 కోట్ల లోపే. అయినా నిరుద్యోగం అక్కడ తీవ్రంగా ఉంది. పాలకుల వైఫల్యం, అవినీతి ఇందుకు కారణం. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో నిరుద్యోగం రేట్లు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన తాజా కార్మిక సర్వే గణాంకాలు ఇందుకు నిదర్శనం. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు గల పని చేయగల వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు ఆగస్టు నెలలో 5.1%కి చేరుకుంది. ఇది మే, జూన్ నెలల్లో 5.6% నుంచి గణనీయమైన తగ్గుదలను సూచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తగ్గుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
గణాంకాలు ఇలా..
కేంద్ర కార్మిక సర్వే ప్రకారం, దేశవ్యాప్త నిరుద్యోగ రేటు జులైలో 5.2% నుంచి ఆగస్టులో 5.1%కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు మే నెలలో 5.1% ఉండగా, ఆగస్టులో 4.3%కి పడిపోయింది. ఇది వరసగా మూడు నెలల్లో నిరంతర తగ్గుదలను సూచిస్తోంది. ఈ గణాంకాలు ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, ఉపాధి అవకాశాల పెరుగుదలకు సానుకూల సంకేతంగా భావించవచ్చు.
తగ్గుదలకు కారణాలు
– గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గడం వ్యవసాయం, గ్రామీణ ఆధారిత పరిశ్రమలు, స్థానిక ఉపాధి కార్యక్రమాలలో ఉపాధి అవకాశాల పెరుగుదలను సూచిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ఉపాధికి ఊతం ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
– సేవల రంగం, ఇ–కామర్స్, రిటైల్, నిర్మాణ రంగాల్లో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు పట్టణ నిరుద్యోగ రేటు తగ్గడానికి దోహదపడ్డాయి.
– స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి.
స్థిరమైన పురోగతి..
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3%కి తగ్గడం ఆశాజనక సంకేతం. వ్యవసాయ సీజన్, గ్రామీణ స్వయం ఉపాధి పథకాలు, కౌశల అభివృద్ధి కార్యక్రమాలు ఈ తగ్గుదలకు కారణంగా ఉండవచ్చు. అయితే, ఈ ఉపాధి అవకాశాలు తాత్కాలికమా లేక దీర్ఘకాలికమా అనేది పరిశీలించాల్సిన అంశం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి ఈ సానుకూల ధోరణిని కొనసాగించడంలో కీలకం.
దేశంలో నిరుద్యోగ రేటు తగ్గడం ఆర్థిక పునరుద్ధరణకు సానుకూల సంకేతం అయినప్పటికీ, ఈ పురోగతి దీర్ఘకాలికంగా కొనసాగాలంటే నాణ్యమైన ఉపాధి సృష్టి, నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించాలి. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన తగ్గుదల ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పట్టణ–గ్రామీణ అసమానతలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం ప్రభుత్వం ముందున్న సవాళ్లు.