HomeజాతీయంCM MK Stalin Education Policy: కేంద్రంపై స్టాలిన్‌ తిరుగుబాటు.. సొంత పాలసీకి ప్రాధాన్యత

CM MK Stalin Education Policy: కేంద్రంపై స్టాలిన్‌ తిరుగుబాటు.. సొంత పాలసీకి ప్రాధాన్యత

CM MK Stalin Education Policy: కేంద్రానికి.. దేశంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది. గవర్నర్ల తీరు.. కేంద్రం పాలసీలను రాష్ట్రాలను సంప్రదించకుండా అమలు చేయడం.. బలవంతంగా రుద్దడంగా భావిస్తున్నాయి. మొన్నటి వరకు ఢిల్లీలోని ఆప్, ఒడిశాలోని బీజూ జనతాదళ్, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించాయి. ఈ పార్టీలు అధికారం కోల్పోయాయి. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే ఇప్పటికీ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రాష్ట్ర సొంత విద్యా విధానం (ఎస్‌ఈపీ)ను శుక్రవారం(ఆగస్టు 8న) ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కు ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ విధానం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య విద్యా రంగంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. ఎన్‌ఈపీలోని త్రిభాషా సూత్రం, కేంద్రీకృత ప్రవేశ పరీక్షలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దానిని ‘ప్రతిగామి‘, ‘సామాజిక న్యాయ వ్యతిరేక‘మని, ‘హిందీ రుద్దడం‘గా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈపీ ఆవిష్కరణ రాష్ట్ర రాజకీయ, విద్యా రంగాల్లో కీలక పరిణామంగా మారనుంది.

Also Read: రేవంత్ శత్రువును చంపలేదు.. ఓడించాడు

ఎస్‌ఈపీ కీలక అంశాలు..
రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి. మురుగేసన్‌ నేతృత్వంలో రూపొందిన ఎస్‌ఈపీ, విజ్ఞాన ఆధారిత విద్య, కృత్రిమ మేధస్సు(ఏఐ), ఆంగ్ల భాషా నైపుణ్యాలపై దృష్టి సారిస్తుంది. అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ విధానం రూపొందింది. ముఖ్యంగా, కళలు, సైన్స్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలను తొలగించి, 9వ, 10వ తరగతుల మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పించాలని సిఫారసు చేస్తోంది. ఇది ఎన్‌ఈపీ ప్రవేశ పరీక్షల విధానానికి పూర్తి విరుద్ధం. ఈ సిఫారసులు తమిళనాడు విద్యా వ్యవస్థను స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

కేంద్రం వర్సెస్‌ తమిళనాడు..
తమిళనాడు ఎన్‌ఈపీని అమలు చేయడానికి నిరాకరించడంతో, కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్‌ కింద రూ.2,152 కోట్ల నిధులను నిలిపివేసింది. ఈ చర్యను తమిళనాడు ప్రభుత్వం ‘బలవంతపు ఒత్తిడి‘గా విమర్శిస్తూ, విద్య రాష్ట్ర, కేంద్ర ఉమ్మడి అధికార జాబితాలో ఉన్నందున రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు, ఎస్‌ఈపీ ద్వారా భారతీయ విద్యార్థులను గ్లోబల్‌ స్థాయిలో పోటీపడేలా చేయడం, భాషా అభ్యాసంలో సౌలభ్యం కల్పించడం, ఆంగ్ల భాషపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉందని కేంద్రం వాదిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ఎస్‌ఈపీ ఆవిష్కరణను మరింత రాజకీయంగా సంక్లిష్టం చేస్తున్నాయి.

ఎన్‌ఈపీపై తమిళనాడు వ్యతిరేకత..
తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యావిధారంలోని త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, దీనిని హిందీ రుద్దడంగా భావిస్తోంది. డీఎంకే నాయకత్వం ఎన్‌ఈపీని సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనదిగా, రాష్ట్ర భాషా, సాంస్కృతిక గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నంగా చూస్తోంది. తమిళనాడు ఎప్పటినుంచో ద్విభాషా విధానాన్ని (తమిళం, ఆంగ్లం) అనుసరిస్తూ, హిందీని ఐచ్ఛికంగా ఉంచింది. ఎస్‌ఈపీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఆంగ్ల నైపుణ్యంతోపాటు స్థానిక భాషా విద్యను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. ఈ విధానం రాష్ట్ర సాంస్కృతిక, విద్యా గుర్తింపును కాపాడే ప్రయత్నంగా కనిపిస్తోంది.

ఎస్‌ఈపీ ఆవిష్కరణ తమిళనాడు విద్యా వ్యవస్థను ఆధునికీకరించడానికి, సాంకేతికత, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ఒక అవకాశంగా ఉంది. ఏఐ, సైన్స్‌ విద్యపై దృష్టి రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చే సామర్థ్యం కలిగి ఉంది. అయితే, కేంద్రం నిధుల నిలిపివేత, రాజకీయ ఒత్తిళ్లు ఎస్‌ఈపీ అమలును సవాళ్లతో కూడుకున్నదిగా చేస్తున్నాయి. రాష్ట్రం తన విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగితే, ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఒక నమూనాగా మారవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version