Lakshadweep: పాముకు పాలు పోస్తే.. విషమే చిమ్ముతుంది. అదును చూసి కాటు వేస్తుంది, ప్రాణాలు తీస్తుంది. సేమ్ మాల్దీవులు కూడా అంతే.. మనతో అవసరం ఉన్న రోజులు పొగిడింది. మనం ఇచ్చిన డబ్బులు తీసుకుంది. మనం సైన్యాన్ని పంపితే వాడుకుంది. కానీ అక్కడ ముయిజ్జు అనే భారత వ్యతిరేకి ఉన్నాడు. గత ఎన్నికల్లో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచాడు. అక్కడి ప్రజలు కూడా అతడు చెప్పిన మాటలు విన్నారు. కానీ ఆ తర్వాత అతని తత్వం ఇప్పుడిప్పుడే మాల్దీవుల ప్రజలకు బోధపడుతోంది.
ఇటీవల లక్షద్వీప్ పర్యాటకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తే.. ట్విట్టర్ వేదికగా మాల్దీవుల మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసు కదా.. దాంతోనే ఆ దేశంతో మనకు దౌత్యపరమైన విభేదాలు ఏర్పడ్డాయి.. ముయిజ్జు ప్రభుత్వం చైనాతో అంట కాగడం మొదలు పెట్టింది. ఇప్పుడు తాజా పరిణామం ఏంటయ్యా అంటే.. చైనా చైనా సైన్యం మాల్దీవుల భద్రత దళాలకు శిక్షణ ఇస్తుందట. పైగా మాల్దీవులకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుందట. భారత్ మాత్రం కిందిస్థాయిలో పనిచేయాలట. ఇది తాజాగా ముయిజ్జు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. దీనిపై అక్కడ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది సరైన చర్య కాదంటూ మండిపడుతున్నాయి. అయినప్పటికీ ముయిజ్జు వెనుకంజ వేయడం లేదు. చైనా తో సహవాసం ఎంత ప్రమాదకరమో మునుముందు తెలుస్తుందని ముయిజ్జు ప్రభుత్వానికి క్షవరం అయితే కానీ అర్థం కాదు.
మాల్దీవులు ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మన సైన్యాన్ని సాధ్యమైనంత వరకు వెనక్కి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మాల్దీవుల కంటే లక్షద్వీప్ మీద మరింత ఫోకస్ చేసి, అభివృద్ధి చేస్తే ప్రయోజనం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లక్షద్వీప్ లో కేంద్రం పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అక్కడ నౌకాదళ స్థావరాన్ని నిర్మించింది. త్వరలో అక్కడ పర్యాటకంగా పలు కార్యక్రమాలు చేపట్టి.. మాల్దీవులకు మించి అభివృద్ధి చేసే యోచనలో కేంద్రం ఉంది. అయితే చైనాకు చెక్ పెట్టాలంటే ఆ అభివృద్ధి సరిపోదు. అంతకుమించి అనే లాగా ఉండాలి. అప్పుడే భారత్ సత్తా అటు మాల్దీవులకు, ఇటు చైనాకు అర్థమవుతుంది.