Parliament : ఢిల్లీ పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. మూడంచెల సెక్యూరిటీని దాటుకుని ఇద్దరు అగంతకులు సభలోకి చొరడడం కలకలం రేపింది. ఆ ఇద్దరూ షూస్‌లో ఒక రకమైన గ్యాస్ పెట్టుకుని వచ్చి… లోపలికి వచ్చాక వాటిని విసిరారు. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సరిగ్గా 22 ఏళ్ల తర్వాత..
2001, డిసెంబర్ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది అమరులయ్యారు. సరిగ్గా అదే రోజు.. ఇద్దరు అగంతకులు లోక్‌సభలోకి చొరబడ్డారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి కిందకు దూకారు. తమ షూలలో పసుపురంగులో ఉండే ఒకరకమైన గ్యాస్ టిన్స్ దాచుకుని వచ్చారు. లోనికి చొరబడగానే గ్యాస్ టిన్స్ ఓపెన్‌చేసి విసిరారు. జీరో అవర్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో పార్లమెంటు సభ్యులు భయంతో పరుగులు తీశారు. గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి టియర్ గ్యాస్ వదలడంతో పార్లమెంటు సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. పార్లమెంటుపై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు అవుతుంది. సరిగ్గా ఇదే రోజు ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
నిరసన కోసమా.. దాడి చేయడానికా?
పార్లమెంటు లోపల ఇద్దరు చొరబడగా బయట మరికొంత మందిని గుర్తించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మహారాష్ట్రకు చెందినవారిగా పోలీసులు అనుఆనిస్తున్నారు. పార్లమెంట్ బయట ఓ మహిళ మరాఠీలో నినాదాలు చేయడం కనిపించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. వీరు దాడి చేయడానికి వచ్చారా.. లేక నిరసన తెలుపడానికి వచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్లు కనపడింది.
