Train Passenger Insurance : ప్రయాణ బీమా, ప్రమాద బీమా విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. ఏమోస్తుందిలే అని లైట్ తీసుకుంటాం. కానీ ప్రమాదం జరిగినప్పుడు కానీ వాటి విలువ తెలియదు. కుటుంబ యజమాని చనిపోయినప్పుడు, క్షతగాత్రుడిగా మారినప్పుడు ఆ కుటుంబం మూల్యం చెల్లించుకుంటుంది. వీధిన పడుతుంది. ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరుగుతునే ఉంది. చనిపోయినవారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధరమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక-సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో వారికి రైలు ప్రయాణ బీమా ఆర్థికంగా అండగా నిలుస్తుంది. కానీ చాలామంది బీమా పథకం గురించి తెలియక వినియోగించుకోలేక పోతున్నారు. ఇంతకీ ఈ బీమాకు ఖర్చు ఎంతో తెలుసా అక్షరాలా 45 పైసలు. దానికి దక్కే పరిహారం ఎంతో తెలుసా అక్షరాలా రూ.10 లక్షలు.
సాధరణంగా ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే రైలు టిక్కెట్ బుక్ చేసుకుంటారు. అటువంటి సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీనిని టిక్ చేసుకుంటే టిక్కెట్ ధరతో కేవలం 45 పైసల్ కట్ అవుతుంది. కానీ రూ.10 లక్షల బీమా కవర్ అవుతుంది. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి మృత్యువాత పడితే ఆ బీమా డబ్బు కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.
కానీ చాలా మంది ఆన్ లైన్ టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో ఏమరపాటులో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ను ఎంచుకోవడం లేదు. ఏం కాదులే అన్న నిర్లక్ష్యం ఒక కారణమైతే, అసలు అలాంటి ఆప్షన్ ఒకటి ఉందని తెలియకపోవడం మరొక ప్రధాన కారణం. ఈ బీమా పథకం ఒక ఆర్థిక రక్ష. దురదృష్టవశాత్తు ఒడిశా లాంటి సంఘటనలు జరిగినప్పుడు, మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు కవరేజ్ అందుతుంది. గాయపడిన వారికి కూడా బీమా కవరేజ్ ఉంటుంది.
ఈ ట్రావెల్ బీమాలో నామినీ పేరు మాత్రం కీలకం. కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి. నామినీతో ఉండే బంధుత్వం ఆప్షన్ కూడా రాయాల్సి ఉంటుేంది. టిక్కెట్ బుక్ చేసినప్పుడు వెబ్ సైట్,యాప్ లలో ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్ ను బీమా సంస్థ పంపుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.
ప్రమాద తీవ్రత, మృతి, వైకల్య శాతం బట్టి బీమా మొత్తం అందుతుంది. రైలు ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే అతని కుటుంబానికి రూ.10 లక్షలు అందుతుంది. ప్రమాదంలో రైల్వే ప్రయాణికుడు పూర్తిస్థాయి అంగవైకల్యం చెందినా బీమా కంపెనీ అతనికి 10 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తుంది. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, గాయాలు అయితే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు. ఈ ఆర్థిక రక్షగా నిలిచే ట్రావెల్ బీమాను ప్రతీ రైలు ప్రయాణికుడు వినియోగించుకోవాల్సిన అవసరముంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Rs 10 lakh travel insurance for only 45 paise financial protection for train passengers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com