Bihar Election Result: కుటుంబ పార్టీ అని.. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ అని.. పశువుల దాణా నుంచి మొదలుపెడితే రైల్వే ఉద్యోగాల వరకు అమ్ముకున్న పార్టీ అని.. ఇలా ఆర్జెడి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. జంగిల్ రాజ్ సర్కార్ నడిపిందని.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిందని.. లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద ఆరోపణలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలు ఈ ఆరోపణలు చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ బీహార్ రాష్ట్రంలో ఆర్జెడీకి కొన్ని వర్గాలలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ వర్గాలు లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులకు వీర విధేయులుగా ఉంటారు. లాలు కుటుంబంలో ఎటువంటి లుకలుకలు బయటపడినా వారు తట్టుకోలేరు. పైగా లాలు నాయకత్వాన్ని ఇప్పటికీ కోరుకుంటారు. తేజస్వి యాదవ్ తమ కోసం పుట్టిన సారధి అని నమ్ముతుంటారు.
ఆర్జెడి కాంగ్రెస్ పార్టీతో కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ చేసింది. 12 స్థానాలలో సీట్ల పంపకం సాధ్యం కాకపోవడంతో స్నేహపూర్వక పోటీ కూడా చేసింది. ఇన్ని రకాలుగా చేసినప్పటికీ.. తేజస్వి యాదవ్ కాలికి బలపం కట్టుకొని బీహార్ మొత్తం ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సింగిల్ డిజిట్ స్థానాలకు పరిమితం కాకపోయినప్పటికీ ఆర్ జె డి ఊహించని విధంగా ఎన్నికల్లో ఫలితం వచ్చింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆర్జెడి కి భారీగా ఓట్లు వచ్చాయి. అయితే ఎక్కువ స్థాయిలో ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు మాత్రం గెలుచుకోలేకపోయింది.
ఆర్జెడి 143 స్థానాలలో పోటీ చేసింది. 22.84 శాతం ఓట్లను సాధించింది. వాస్తవానికి ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86%, జేడీయూ కంటే 3.97% ఎక్కువ. ఇంత ఓటు శాతం ఉన్నప్పటికీ ఆర్ జె డి 25 స్థానాలకే పరిమితమైంది. అంతటి ఓటు శాతం సాధించినప్పటికీ ఆర్జెడి కేవలం 25 స్థానాల వద్ద మాత్రమే ఆగిపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవానికి సీట్ల కేటాయింపులు కాంగ్రెస్ పార్టీ బెట్టు చేయకపోతే.. ఆర్జెడి ఇంకా మరిన్ని స్థానాలలో పోటీ చేసేది. అప్పుడు ఫలితం మరో విధంగా ఉండేది. కానీ సీట్ల కేటాయింపు సమయంలో సరైన విధానం పాటించకపోవడం వల్ల ఇప్పుడు ఈ స్థాయిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆర్జెడి కార్యకర్తలు అంటున్నారు.. చివరికి తేజస్వి యాదవ్ కూడా ఒకానొక దశలో ఓటమి అంచు దాక వెళ్లారని.. చివరికి విజయం సాధించారని ఆర్జెడి కార్యకర్తలు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికలు తీవ్రమైన చర్చకు దారితీసాయి. మహారాష్ట్ర, హర్యానా ప్రాంతాలలో వరుస ఓటముల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ఎదుర్కొంది. పైగా రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ ర్యాలీని నిర్వహించారు. బీహార్లో 24 జిల్లాల్లో పర్యటించారు. అయినప్పటికీ ఆ సానుభూతి కూడా ఓటర్ల నుంచి వ్యక్తం కాలేదు. ఆ ఎఫెక్ట్ ఆర్జెడి మీద కూడా పడింది. ఫలితంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు రాలేదు. ఫలితంగా ప్రతిపక్ష ఆర్ జె డి మరోసారి ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.