https://oktelugu.com/

Toll Tax: వాహనదారులకు ఊరట.. ఇక టోల్ గేట్ దగ్గర ఆగాల్సిన పనిలేదు..

వాహనాలు పెరిగిపోవడం, కొవిడ్ తర్వాత కార్ల కొనుగోలు ఎక్కువ కావడంతో.. పాస్టాగ్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూపర్ పాస్టాగ్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

Written By: , Updated On : January 17, 2024 / 05:25 PM IST
Toll Tax

Toll Tax

Follow us on

Toll Tax: ఒకప్పుడు జాతీయ రహదారుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర కచ్చితంగా ఆగాల్సి వచ్చేది. భారీగా వాహనాలు బారులు తీరి ఉండడంతో ట్రాఫిక్ టోల్ గేట్ల స్తంభించేది.. పండుగలు, ప్రత్యేక సెలవుల్లో గంటల తరబడి టోల్ గేట్ల దగ్గర ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి అంటే బిజెపి ప్రభుత్వం కొలువు దీరిన రెండవ టర్మ్ లో ఫాస్ట్ టాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల మన వాహనం టోల్ గేటు వద్దకు రాగానే ఆటోమేటిగ్గా ఆ ఫాస్ట్ టాగ్ కు అనుసంధానం చేసిన ఖాతా నుంచి డబ్బు టోల్ గేట్ నిర్వాహకుల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. అయితే ఈ విధానం కూడా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ కు కారణమైంది.

వాహనాలు పెరిగిపోవడం, కొవిడ్ తర్వాత కార్ల కొనుగోలు ఎక్కువ కావడంతో.. పాస్టాగ్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూపర్ పాస్టాగ్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఈ విధానంలో కూడా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. పైగా వాహనాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రద్దీ తారాస్థాయికి చేరుతోంది. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో టోల్ గేట్లు ఎంత రద్దీగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఉత్తర భారతంలో అయితే టోల్ గేట్ల వద్ద రద్దీ వాతావరణం నిత్య కృత్యంగా మారింది. అయితే దీనిని నివారించేందుకు కేంద్రం సరికొత్త పద్ధతిని అమలు చేయబోతోంది.

ఫాస్ట్ టాగ్ విధానానికి స్వస్తి పలికి ఇకపై జిపిఎస్ ఆధారిత టోల్ చార్జీ వసూలు చేసే విధానానికి శ్రీకారం చుట్టునుంది. దీనివల్ల కారు బయలుదేరి హైవే ఎక్కినప్పుడే జిపిఎస్ ఆధారంగా అనుసంధానించిన ఖాతా నుంచి టోల్ చార్జి మినహాయించుకుంటారు. ఫలితంగా టోల్ గేట్ల దగ్గర వాహనాలు ఆగాల్సిన పని ఉండదు. నేరుగా రయ్యిమంటూ దూసుకెళ్ళవచ్చు. విదేశాల్లో ప్రస్తుతం ఇలాంటి విధానమే అమల్లో ఉంది. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవడంతో పాటు.. టోల్ గేట్ వద్ద రద్దీ ఏర్పడకుండా చూడవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు టోల్ గేట్ నిర్వహణ భారం కూడా నిర్మాణ సంస్థలకు తప్పుతుందని చెబుతోంది.