Jubilee Hills By Election Result 2025: గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రధానంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గులాబీ పార్టీ కచ్చితంగా గెలిచేది. పాలేరు నుంచి మొదలు పెడితే మునుగోడు వరకు గులాబీ పార్టీ ఇదే విధంగా దూసుకుపోయింది. దుబ్బాక, హుజురాబాద్ లో మాత్రం గులాబీ పార్టీ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంచనాలకు అందని ఫలితాలు వచ్చినప్పటికీ.. అప్పట్లో మజ్లీస్ తో ఉన్న స్నేహబంధం కారణంగా గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. కాకపోతే రోజులు మొత్తం ఒకే విధంగా ఉండవు. గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ఏకచత్రాధిపత్యంగా పరిపాలించింది. ప్రతిపక్షానికి చోటు లేకుండా చేసింది.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ అమలు చేసే వ్యూహాలు సులభంగానే బయటికి వచ్చేవి. వాటికి తగ్గట్టుగానే కేసీఆర్ ప్రతి వ్యూహాలు అమలు చేసేవారు. ఫలితంగా ఎన్నిక ఏదైనా సరే.. ఎన్నిక ఎక్కడ జరిగిన సరే గులాబీ పార్టీ గెలవడం అనేది కామన్ అయిపోయింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా అయితే ఒత్తిడి ఎదుర్కొన్నదో.. ఇప్పుడు గులాబీ పార్టీ కూడా అదే స్థాయిలో ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీలో ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీకి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం నాయకులు పెద్దగా కనిపించలేదు. పువ్వాడ అజయ్ కుమార్.. ఇంకా కొంతమంది నాయకులు మినహా ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు ప్రచారంలోకి రాలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యత మొత్తం అధిష్టానం కేటీఆర్ కు అప్పగించింది. ఇది కొంతమంది ముఖ్య నేతలకు మింగుడు పడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గులాబీ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ ఘనత మొత్తం కేటీఆర్ కు దక్కుతుందని భావించిన వారంతా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది కేటీఆర్ తో కలిసి రాలేదని చెబుతున్నారు. అంతేకాదు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకోవడంలో కాస్త ఇబ్బంది ఎదురయిందని.. అది పూడ్చలేని నష్టాన్ని చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తండ్రి మరణంతో హరీష్ రావు కొద్దిరోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే అవి గెలుపు దిశగా పార్టీ అభ్యర్థిని నడిపించలేకపోయాయి. కింది స్థాయి కేడర్లో కొంతమందిని కవిత నియంత్రించినట్టు తెలుస్తోంది. ఇన్ని పరిణామాలు మొత్తం గులాబీ పార్టీకి ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నవీన్ యాదవ్ ను ఉద్దేశించి ఆకురౌడీ అని కేటీఆర్ విమర్శించారు. అవి కూడా తీవ్రంగా ప్రభావం చూపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఎన్నో కేసులు ఉన్నా ఓ వ్యక్తిని కేటీఆర్ గులాబీ పార్టీలో చేర్చుకున్నారని.. అటు వంటి వ్యక్తిని వదిలిపెట్టి నవీన్ యాదవ్ ను ఆకు రౌడీ అని సంబోధించడం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి చర్చ ప్రజల్లో జోరుగా సాగింది కాబట్టే.. గులాబీ పార్టీని ఓటర్లు తిరస్కరించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి “క్రెడిట్” రాజకీయం ప్రధాన కారణంగా నిలిచిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కొంతమంది గులాబీ పార్టీ నాయకులు కోవర్టులుగా పని చేశారని.. పార్టీ వ్యూహాలు ముందుగానే కాంగ్రెస్ పార్టీకి తెలియడానికి ఇదే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం వల్ల తాము చాలా నేర్చుకున్నామని కేటీఆర్ అన్నారు. ఈ ప్రకారం ఈ ఫలితం నుంచి ఆయన పార్టీని ఏ విధంగా మార్చుతారు? ఎలా సరికొత్త బలాన్ని నింపుతారనేది? చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.