కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు కేంద్ర బడ్జెట్ వల్ల తమకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటుందని భావిస్తున్నారు. గతేడాది మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన నేపథ్యంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్ లో మూడు కీలక నిర్ణయాలు ఉండవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిమితితో పోలిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాపై ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని రెట్టింపు చేయాలని చాలామంది భావిస్తున్నారు. బడ్జెట్ లో ఈ మేరకు కీలక ప్రతిపాదనలు ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. పీపీఎఫ్ ఖాతాపై ఇన్వెస్ట్‌మెంట్ పరిమితి పెరిగితే సామాన్య, మధ్యతరగతి వర్గాలను ప్రయోజనం చేకూరుతుంది.
ప్రస్తుతం గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పీపీఎఫ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండగా ఈ పరిమితిని 3 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐసీఏఐ ఆర్థిక శాఖ సైతం ఇవే తరహా ప్రతిపాదనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐసీఏఐ చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఐసీఏఐ పన్ను చెల్లింపుదారులకు మినహాయింపులను పెంచితే వారి సేవింగ్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. పన్ను మినహాయింపు పరిమితిని సైతం లక్షన్నర నుంచి రెండున్నర లక్షలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుపై పూర్తిగా పన్ను మినహాయింపు కల్పించాలని కూడా ఐసీఏఐ నుంచి ప్రతిపాదనలు వ్యక్తమవుతున్నాయి.