దేశంలోని బ్యాంకులు 2021 సంవత్సరం జనవరి నెల 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానున్నాయి. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాలి. తరచూ లావాదేవీలు నిర్వహించేవాళ్లు నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాజిటివ్ పే సిస్టమ్ పేరుతో చెక్కుల చెల్లింపులకు బ్యాంకులు నిబంధనలలో కీలక మార్పులు చేశాయి.
ఇకపై చెక్కు ద్వారా 50 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇతరులకు ఇవ్వాలంటే బ్యాంకు అధికారులకు చెక్ ఇచ్చినట్టు ఖాతా కలిగి ఉన్న వ్యక్తి మరోసారి ధృవీకరించాల్సి ఉంటుంది. దేశంలో చెక్ ద్వారా జరిపే లావాదేవీలలో మోసాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నూతన నిబంధనల ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ప్రయోజనం చేకూరనుంది.
చెక్ ద్వారా జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకులు అమలులోకి తెస్తున్న ఈ కొత్త నిబంధనలు వినియోగదారులకు బ్యాంకు ఖాతాల ద్వారా సురక్షితంగా లావాదేవీలు జరపడానికి తోడ్పడతాయి. నూతన విధానంలో బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తే చెక్ గురించి ధృవీకరిస్తూ ఉండటంతో చెక్ ట్యాంపరింగ్ కు అవకాశం ఉండదు. నూతన విధానంలో ఎవరికి చెక్ ఇచ్చామో పూర్తి వివరాలతో బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇకపై బ్యాంకులు చెక్కు వివరాలను సరిపోల్చి వివరాలు సరిగ్గా ఉంటే మాత్రమే నగదు బదిలీ చేస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెక్కులకు సంబంధించి త్వరలో ఒక కొత్త విధానాన్ని సైతం అమలులోకి తీసుకురానుందని తెలుస్తోంది. 5 లక్షల రూపాయలకు పైగా చెక్కుల కోసం ఈ విధానం అమలు కానుందని తెలుస్తోంది.