PM Modi : తెలంగాణకు మోడీ ఏం ఇచ్చాడు? బీజేపీ ఏం ఇచ్చింది? శుష్క చేతులు, ఉత్తి మాటల తప్ప ఏం ఒరగపెట్టారు? ఇక నుంచి ఈ ప్రశ్నలు బీఆర్‌ఎస్ వాళ్లు వేసే అవకాశం ఉండకపోవచ్చు. కేసీఆర్ నుంచి కేటీఆర్ దాకా విమర్శలు ఇక వినిపించకపోవచ్చు. వాళ్లందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా మోడీ వరాలు కురిపించారు. ఒకరకంగా చెప్పాలంటే 2024 ఎన్నికలకు ఉమ్మడి పాలమూరు నుంచి మోడీ శంఖారావం పూరించారు. తెలంగాణ పుట్టుకునే అనుమానిస్తున్నారు అని వ్యాఖ్యానించిన మహబూబ్ నగర్ శాసనసభ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్ సొంత నియోజకవర్గం నుంచి తిరగులేని విధంగా మోడీ వరాల వాన కురిపించారు.
త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. వీటన్నింటినీ సెట్ రైట్ చేసే పనిలో పడింది బీజేపీ అధిష్ఠానం. అందులో భాగంగానే ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యాతిథిగా ప్రజాగర్జన పేరుతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ సభ నిర్వహించింది. సాధారణంగా ఈ సభ నుంచి అధికార బీఆర్‌ఎస్‌పై మోడీ విమర్శలు చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలు తలకిందులు చేస్తూ మోడీ వరాలు కురిపించారు. తెలంగాణకు ఏం ఇస్తలేడు అనే స్థాయి నుంచి తెలంగాణకు ఇంకా ఏం కావాలి అనే దాకా పలు పథకాలు ప్రకటించారు.
‘పసుపు రైతుల కోసం టర్మరిక్ బోర్డు, ములుగులో సమ్మక్క సారమ్మ పేరుతో రూ. 900 కోట్లతో గిరిజన విశ్వవిద్యాలయం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మార్పు’ వంటి వరాలను మోడీ తెలంగాణపై ప్రకటించారు. తెలంగాణ ప్రాంతంలో పసుపు భారీగా పండుతుంది. అయితే ఆశించిన మేర మద్దతు ధర లభించడంలేదు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్.. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కేంద్రం ఇన్నాళ్లూ దానిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో అరవింద్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే తెలంగాణలో బీజేపీ హైదరాబాద్ తర్వాత కాస్తో కూస్తో బలం ఉంది నిజామాబాద్‌లోనే. పసుపు బోర్డు ప్రకటిం చకపోతే ఇక్కడ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుం దని భావించిన బీజేపీ అధిష్ఠానం.. బోర్డు ఏర్పాటును మోడీ ద్వారా ప్రకటింపజేసింది. ‘కోవిడ్ సమయంలో పసుపు ఎంతో గొప్ప పని చేసింది. కోవిడ్‌ను తగ్గించడంలో తోడ్పడింది. అప్పుడే నాకు పసుపు గొప్పతనం తెలిసిందని’ పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.
ఇక ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఎప్పటి నుంచో ప్రతిపాదనలో ఉంది. ఈ యూనివర్సిటీ ఏర్పా టు ప్రతిపాదన విభజన చట్టంలో కూడా ఉంది. ఇన్నా ళ్లకు ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి ఏకంగా 900 కోట్లు కేటాయించింది. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సెంటర్ ఆఫ్ ఎమినెన్స్‌గా మారుస్తున్నామని మోడీ ప్రకటిం చడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సెంటర్ ఆఫ్ ఎమినెన్స్‌గా మార్చడం వల్ల కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తాయి. కొత్త కోర్సుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఇకే కాక హసన్- చర్లపల్లి(హెచ్‌పీసీఎల్) పైప్‌లైన్‌ను మోడీ జాతికి అంకితం చేశారు. వరంగల్- విజయవాడ-ఖమ్మం హైవే పనులకు మోడీ శంకు స్థాపన చేశారు. కృష్ణపట్నం- హైదరాబాద్ మల్టీ లెవల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2,457 కోట్లతో నిర్మించే ఖమ్మం- సూర్యాపేట హైవేకు మోడీ శంకుస్థాపన చేశారు.