PM Kisan: రైతులకు మోడీ గుడ్ న్యూస్.. బటన్ నొక్కాగానే 21 వేల కోట్ల జమ

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అన్నదాతలకు పెట్టుబడి సహాయం కింద ఈ పథకానికి రూపకల్పన చేసింది. పథకంలో భాగంగా దేశంలోని రైతులకు నాలుగు నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 కేంద్రం రైతుల ఖాతాలో జమ చేస్తుంది.

Written By: Suresh, Updated On : February 29, 2024 8:27 am
Follow us on

PM Kisan: పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని రైతులకు శుభవార్త చెప్పారు. కష్టకాలంలో వారికి అండగా ఉండేందుకు ప్రయత్నించారు. వారు ఎదురుచూపులు చూసేందుకు ఆస్కారం ఇవ్వకుండా త్వరితంగా సర్కారు సాయం అందించారు. వ్యవసాయ పెట్టుబడికి అందించే సహాయం లో భాగంగా ప్రవేశపెట్టిన “ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ” ద్వారా 16వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిమోట్ బటన్ నొక్కి 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. పెట్టుబడి సహాయం ఖాతాలో జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు అమలు చేస్తుండడంతో సర్కారు సాయానికి సంబంధించిన నగదు కేవలం లబ్ధిదారుల ఖాతాలో మాత్రమే జమవుతోంది.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అన్నదాతలకు పెట్టుబడి సహాయం కింద ఈ పథకానికి రూపకల్పన చేసింది. పథకంలో భాగంగా దేశంలోని రైతులకు నాలుగు నెలలకు 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 కేంద్రం రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 15 విడతలుగా కేంద్రం రైతుల ఖాతాలో నిధులు జమ చేసింది.. 15వ విడత నిధులను గత ఏడాది నవంబర్ లో కేంద్రం విడుదల చేసింది. అప్పట్లో ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18 వేల కోట్ల రూపాయలను జమ చేశారు. తాజాగా 16వ విడతలో కూడా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు.

తమ ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు రైతులు http:// pmkisan.gov.in/ వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది. ఆ సైట్లో ముందుగా ఫార్మర్స్ కార్నర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ విభాగంలో ఈ కేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, బెన్ఫిషరీ లిస్ట్, నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నిధులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు బెన్ ఫిషరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి. అందులో రాష్ట్రం, ఉప జిల్లా, బ్లాక్, విలేజ్ విభాగాలలో ఇచ్చిన ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. అప్పుడు అందులో జాబితా వస్తుంది. జాబితాలో పేరు ఉంటే కచ్చితంగా డబ్బులు జమైనట్టే. జమ కాకుంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే త్వరలో పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో ఈసారి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతారని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేకుండా పాతతరహాలోనే కేంద్రం పెట్టుబడి సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం విశేషం.