CM Basavaraj Bommai: మెజారిటీ లేకున్నా కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. గతంలో కాంగ్రెస్ అనుసరించిన బాటనే బిజెపి పాటించింది. మరో ఏడాది లో ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముంచెత్తే వర్షాలు, ఇబ్బంది పెట్టిన వరదలు ఇలా వేటిని వదులుకోవడం లేదు. ఇక తాజాగా ఒక అడుగు ముందుకేసి సీఎం బసవరాజుని టార్గెట్ చేసింది.

ఇంతకీ ఏం చేసిందంటే
ప్రస్తుతం కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉంది. నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి కొంత దూరంలో నిలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పిరాయించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే కర్ణాటకలో అవినీతి తారాస్థాయికి చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరు అస్తవ్యస్తమైంది. ఐటి కంపెనీలు చాలావరకు నీట మునిగిపోయాయి. పైపెచ్చు కింది స్థాయి బిజెపి నాయకులు ప్రభుత్వ పథకాల్లో అవినీతికి తెరలేపారు. ప్రస్తుతం సోషల్ మీడియా బలంగా ఉన్న నేపథ్యంలో వారి తీరును ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు, నెటిజెన్లు ఏకిపారేస్తున్నారు.
Also Read: CM Jagan: ఓటమికి బాటలు వేసుకుంటున్న జగన్!!
ఇటీవల తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాదులో బిజెపి నిర్వహించిన నేపథ్యంలో.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ను ప్రత్యేక అతిథిగా పిలిచారు. ఆ సమయంలో ఇక్కడి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మిస్టర్ 40% వెల్కమ్ టు తెలంగాణ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి నొచ్చుకున్న ఆయన.. రేపు సీఎం కేసీఆర్ కర్ణాటక కు వస్తే మేం కూడా అలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇది జరిగిన మూడు రోజులకే కర్ణాటక వ్యాప్తంగా # పే సీఎం అనే యాష్ ట్యాగ్ తో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే స్కానర్ ల మాదిరి కరపత్రాలు ముద్రించి గోడల మీద అంటిస్తున్నారు. స్కాన్ మధ్యలో ముఖ్యమంత్రిని ఫోటోను ఉంచారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

ప్రతి దానికి కమీషనే
కర్ణాటకలో అవినీతి తారస్థాయికి పెరిగిపోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో అధికార పార్టీ నాయకులు 40% కమీషన్ పుచ్చుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పే సీఎం అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గానే బిజెపి నాయకులు కూడా తాము క్యూఆర్ కోడ్ కు స్కాన్ చేశామని, డబ్బులన్నీ ఇటాలియన్ బ్యాంకులోకి వెళ్లాయని చురకలు అంటిస్తున్నారు. కాంగ్రెస్ ఈ తరహా క్యాంపెయిన్ చేయడంతో బిజెపి నాయకులు భారత్ తోడో పేరుతో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను, ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ చేసిన అవినీతిని ఎండగడుతున్నారు. బళ్లారిలో కాంగ్రెస్ నాయకుల దాష్టీకం వల్ల రోడ్డున పడిన కార్మికులతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ఉండగానే కర్ణాటకలో బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీ విమర్శల వల్ల రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Also Read: KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్.. కేసీఆర్ నిర్ణయం నిరుద్యోగులకు శాపం!