Ram Mandir: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా స్పైస్ జెట్ విమానయాన సంస్థ ప్రత్యేక సేల్ ను ప్రారంభించింది.జనవరి 22 నుంచి సెప్టెంబర్ 30 వరకు విమాన టిక్కెట్ల ధరలు తగ్గించడంతో పాటు సీట్ల ఎంపిక చార్జీలపై 30% రాయితీని ప్రకటించింది. కొన్ని మార్గాల్లో టికెట్ ధరను రూ.1622గా నిర్ణయించింది. అయితే ఈనెల 22 నుంచి 28 మధ్య బుక్ చేసుకునే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదే సమయంలో టికెట్ బుక్ చేసుకున్న వారు విమానం బయలుదేరడానికి 96 గంటల ముందు వరకు ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును సైతం కల్పించింది.
అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం వివిధ నగరాల నుంచి స్పైస్ జెట్ విమానయాన సంస్థ తన సర్వీసులను ప్రారంభించింది. ఫిబ్రవరి 1 నుంచి వివిధ నగరాల నుంచి స్పైస్ జెట్ విమానాలు తిరగనున్నాయి. ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని వేడుకలకు హాజరవుతున్న వారి కోసం ఆదివారం ప్రత్యేక విమానాన్ని నడిపింది. అయితే స్పైస్ జట్టు విమాన టిక్కెట్ల ధర తగ్గింపు కొత్త కాదు. గతంలో చాలా ఈవెంట్ల సమయంలో ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అయోధ్య రామ మందిరం ప్రతిష్ట వేడుకలు జరుగుతున్నందున ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే టిక్కెట్ కనిష్ట ధర రూ.1622 కొన్ని మార్గాలకే వర్తించనుంది. ముంబాయి- గోవా, ఢిల్లీ- జైపూర్, గౌహతి- బాగ్ డోగ్రా వంటి ప్రముఖ మార్గాల్లోనే ఈ కనిష్ట టిక్కెట్ ధరతో ప్రయాణ అవకాశం కల్పించింది స్పైస్ జెట్ విమానయాన సంస్థ. ఎం సైట్, మొబైల్ యాప్, వెబ్ సైట్, రిజర్వేషన్ కౌంటర్లు, ప్రత్యేక ట్రావెల్ ఏజెంట్ల వద్ద టికెట్లను బుక్ చేసుకుంటే ఆఫర్ వర్తించే ఏర్పాట్లు చేసినట్లు స్పైస్ జెట్ విమానయాన సంస్థ ప్రకటించింది.