National Science Day 2024: సైన్స్ లేకుంటే మనిషి మనుగడలేదు. సైన్స్ వల్ల చేసిన ప్రయోగాలు ఫలితాలు ఇవ్వకుంటే మనిషి జీవితం ఈ స్థాయిలో సుఖవంతం అయ్యేది కాదు. అందుకే సైన్స్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం. అలాంటి సైన్సులో.. శాస్త్ర సాంకేతిక రంగాలు అసలు అభివృద్ధి చెందని కాలంలో భారతదేశానికి చెందిన సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్త రామన్ ఎఫెక్ట్ (Raman effect)ను కనుగొన్నారు. 1928 ఫిబ్రవరి 28న ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న నేపథ్యంలో.. ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే నిర్వహిస్తున్నారు.
సైన్స్ అనేది మనిషి జీవితాన్ని సమూలంగా మార్చేసింది. న్యూటన్ నుంచి మొదలు పెడితే సర్ సివి రామన్ వరకు ఎంతో మంది శాస్త్రవేత్తలు అద్భుతమైన ప్రయోగాలు చేసి మనిషి జీవితంలో సమూల మార్పులకు కారణమయ్యారు. శాస్త్రవేత్తలు చేస్తున్న నిర్విరామ ప్రయోగాల వల్లే మనిషి జీవితం సుఖవంతమైంది. సైన్స్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో సవాళ్లు మనిషిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కొన్నింటికి పరిష్కార మార్గం కనుగొంటే.. ఇంకొన్ని పరిష్కార మార్గ దిశలో ఉన్నాయి.. ఒకప్పటితో పోల్చితే ప్రతి రంగంలోనూ అప్రతిహతమైన వృద్ధి సాధ్యమవుతోంది. దీనంతటికీ కారణం సైన్స్ అభివృద్ధి చెందటం.. శాస్త్రవేత్తల ప్రయోగాలు విజయవంతం కావడమే కారణాలు.
రామన్ ఎఫెక్ట్ కనుగొన్న నేపథ్యంలో సర్ సివి రామన్ జయంతిని ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని చెప్పుకున్నాం కదా… ఈ రామన్ ఎఫెక్ట్ అనేది భౌతిక శాస్త్రంలో ఒక గేమ్ చేజర్ లాంటిది. “కాంతి అనేది ఒక పారదర్శకమైన పదార్థం మీదుగా ప్రయాణించినప్పుడు అది ఒక క్రమ పద్ధతిలో ఉండదు. దాని తరంగధైర్ఘ్యం, శక్తి సమల మార్పులకు దారి తీస్తుంది. దీనినే రామన్ ఎఫెక్ట్ అంటారు. రామన్ ఎఫెక్ట్ ను సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న జన్మదినం రోజు కనుగొన్నారు. భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన ప్రయోగాలకు గానూ 1930 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.
దేశంలో సైన్స్ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. ఈ ఏడాది సైన్సు దినోత్సవ థీమ్ ను ” స్వదేశీ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్” గా ప్రకటించారు. సైన్స్ లో ప్రయోగాలను మరిన్ని చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందేలా చేయడం ఈ థీమ్ లక్ష్యం. అంతేకాదు ఈ రంగంలో చేయాల్సిన ప్రయోగాలను, కృషి చేయాల్సిన వివిధ అంశాలను మననం చేసుకోవడం 2024 సైన్స్ డే థీమ్ ముఖ్య ఉద్దేశమని భారత ప్రభుత్వం చెబుతోంది.