Nara Lokesh: ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైసిపి ఓటు వేసింది. వైసిపి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుంచి టిడిపి బయటికి వస్తుందని పుకారు మొదలైంది. అంతకుముందు ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఇండియా కూటమినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికి వస్తారని.. త్వరలోనే అది జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా రకరకాల కథనాలను వండి వార్చింది. ఇందులో ఉన్న నిజం ఎంత.. దీనిని ఏ విధంగా నమ్మాలి.. అనే విషయాలను పక్కన పెడితే జరుగుతున్న విష ప్రచారం మాత్రం టిడిపికి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఓవర్గం మీడియా రెచ్చగొట్టే విధంగా ప్రసారం చేస్తున్న కథనాలకు మంత్రి లోకేష్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఒకరకంగా జాతీయ వేదిక మీద విష ప్రచారాలు చేసే పార్టీలకు.. మీడియా హౌస్ లకు చెంప పెట్టు లాంటి సమాధానాలు చెప్పారు.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో లోకేష్ మాట్లాడారు.” మేము సంపూర్ణమైన విశ్వాసంతోనే ఎన్డీఏ కూటమిలో చేరాం. దానికంటే ముందు అనేక రకాలుగా చర్చలు జరిగాయి. ఏపీ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయింది. గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన సాగిందో మనం చూసాం. అన్ని ప్రభుత్వ పథకాలలో అవినీతి జరిగింది. వ్యవస్థలలో ఇష్టానుసారంగా వేలు పెట్టి సర్వనాశనం చేశారు. వాటిని బాగు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో మాకు బలమైన భాగస్వామ్యం కావాలి. అందువల్లే ఎన్డీఏ కూటమిలో చేరాం. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నాం. మాకు ఉన్నదృష్టి మొత్తం ఏపీ ప్రయోజనాల మీదే. ఏపీ బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని నిర్మాణం మీద దృష్టి సారించాం. పనులు వేగంగా జరిగిపోతున్నాయి. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. పెట్టుబడులకు ఎర్ర తివాచీ వేశాం. దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయి. ఇది సంతోషకరమైన పరిణామం. దీనివల్ల ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు రావడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. ఇది భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని.. రాజకీయాలకు అతీతంగా మేం చేస్తున్న పని. దీనిని వేరే విధంగా అనుకుంటే చేసేది ఏమీలేదని” లోకేష్ పేర్కొన్నారు.
2029 తర్వాత కూడా
2029 తర్వాత కూడా ఎన్డీఏతో భాగస్వామ్యం కొనసాగుతుందని లోకేష్ కుండబద్దలు కొట్టారు. ఇది అధికారం కోసం ఏర్పరచుకున్న బంధం కాదని.. దేశ అభివృద్ధి కోసం తాము ఇచ్చిన వాగ్దానం అని లోకేష్ స్పష్టం చేశారు. “ఏపీ కోసం భారత్ పనిచేస్తుంది.. ఎన్డీఏ కోసం మేము ఖచ్చితత్వంతో ఉంటామని” లోకేష్ పేర్కొన్నారు.
దానికి పూర్తి మద్దతు
జాతీయ విద్యా విధానం, మూడు భాషల విధానానికి లోకేష్ తన మద్దతును ప్రకటించారు. మాతృభాష విద్యకు పునాది అని పేర్కొన్నారు. హిందీ తప్పనిసరి కాదని.. దానిని నేర్చుకుంటే తప్పు లేదని ఏపీ మంత్రి అన్నారు. భాష ఆధారంగా రాజకీయాలు చేయడం దుర్మార్గమని.. నిరంతర అభ్యాసం మీదనే దృష్టి సారించాలని లోకేష్ పేర్కొన్నారు. తాను ఈ స్థాయిలో ఎదగడానికి మూడు భాషల్లో అభ్యసించిన విధానమే నిదర్శనమని లోకేష్ వ్యాఖ్యానించారు.. కుల గణనకంటే నైపుణ్య గణన అంటేనే తనకు ఇష్టమని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు దృష్టిలో కూడా ఇదే ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యం పోర్టల్ ప్రారంభిస్తున్నట్టు లోకేష్ వ్యాఖ్యానించారు. దీనిద్వారా పౌరుని నైపుణ్యాలు, దానికి కావలసిన శిక్షణ.. పరిశ్రమల అనుసంధానం.. కల్పించే ఉద్యోగాలు వంటి వాటిని ఏకీకృతం చేస్తారు.. తద్వారా ఏపీ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు.
ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యువ మంత్రి అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడారు. విద్య, ఉపాధి, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు.. అన్ని విషయాలపై స్పష్టమైన వైఖరి ప్రదర్శించారు. తద్వారా రాజకీయాలు అన్ని విషయాలలో చేయబోమని.. ఏపీ అభివృద్ధి మాత్రమే తమ ముందు ఉన్న లక్ష్యం అని లోకేష్ తన మాటల్లో చెప్పారు.
