Homeజాతీయ వార్తలుPM Modi 3 Nation Tour: మూడు దేశాల మోదీ పర్యటన.. భారత్‌కు గొప్ప ఖ్యాతి

PM Modi 3 Nation Tour: మూడు దేశాల మోదీ పర్యటన.. భారత్‌కు గొప్ప ఖ్యాతి

PM Modi 3 Nation Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనను ముగించుకున్నారు. జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనను ఘనంగా సన్మానించింది భారతీయ జనతా పార్టీ. ఎయిర్‌పోర్ట్‌ వద్ద భారీ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి.. తదితరులు పాల్గొన్నారు.

మోదీ కాళ్లు మొక్కిన పపువా ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా పపువా న్యూగినియాలో అడుగుపెట్టగానే విమానాశ్రయంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్‌ మరాపె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి స్వాగతం పలికారు.. రెడ్‌ కార్పెట్‌ పరిచారు. ఆయన గౌరవార్థం పపువా న్యూగినియా కళాకారులు తమ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆ దేశ సైన్యం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విమానం నుంచి కిందికి దిగిన వెంటనే జేమ్స్‌ మరాపె.. మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ వెంటనే మోదీకి పాద నమస్కారం చేశారు. కాళ్లు మొక్కి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

ఆస్ట్రేలియాలోనూ ఘన స్వాగతం.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుండి ఘన స్వాగతం లభించింది. మోదీ రాక సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అల్బనీస్‌ ఒక ప్రకటనలో, ‘‘ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో అత్యంత ఘన స్వాగతం లభించిన తర్వాత, ఆస్ట్రేలియాలో అధికారిక పర్యటన కోసం ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం నాకు గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

స్వదేశంలో ఘనస్వాగతం..
మూడు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న మోదీ విమానాశ్రయం నుంచి వేదిక వద్దకు చేరుకున్నారు మోదీ. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని జాతీయ పతాకాలను చేతబట్టుకుని పార్టీ కార్యకర్తలకు ఆయనను ఘనంగా స్వాగతించారు. దారి పొడవునా పూలు చల్లారు. అనంతరం ఈ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి విదేశీయులు గొప్పగా చెప్పుకొంటోన్నారని అన్నారు. ఈ దేశం అతిగొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ఇచ్చిందని, దాని గురించి స్వేచ్ఛగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల విషయాన్ని ఆ దేశ ప్రధాని ముందే ఖండించానని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా, ఆధ్యాత్మికతను వెదజల్లే ఆలయాలపై దాడులు శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పానని, వివిధ ప్రపంచ దేశాధినేతలు ఈ విషయాన్ని అంగీకరించారని మోదీ చెప్పారు.

శాంతికాముకుల దేశం..
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన సమయంలో ఈ యావత్‌ ప్రపంచానికి వ్యాక్సిన్లను అందజేసిన ఘనత భారత్‌కు ఉందని, శత్రువులు సైతం వాటిని వినియోగించుకుంటున్నారనిపేర్కొన్నారు. భారత్‌– గౌతమ బుద్ధుడు, మహాత్మ గాంధీ.. వంటి శాంతికాముకులు జన్మించిన నేల అని పేర్కొన్నారు. శత్రువుల పట్ల కూడా ఉదారంగా వ్యవహరించడమే ఈ మట్టి గొప్పతనమని వ్యాఖ్యానించారు.

భారత్‌వైపు ప్రపంచం చూపు..
భారత్‌ ఏం ఆలోచిస్తోందనే విషయాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తోన్నాయని, అది కరోనా వైరస్‌ వ్యాక్సి¯Œ తయారీతో రుజువైందని అన్నారు. సిడ్నీలో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని మాత్రమే కాకుండా మాజీ ప్రధాని, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్‌ సభ్యులు హాజరయ్యారని, అదే నిజమైన ప్రజాస్వామ్య బలం అని మోదీ అన్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమానికి ఆ దేశ పార్లమెంట్‌ తరలి రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారతీయులకు వారిచ్చే గౌరవాన్ని ఇది ప్రతిబింబించిందని మోదీ చెప్పారు.

ప్రపంచం ఎదుట భారతీయ గొప్పదనం..
దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల.. ప్రపంచం ఎదుట భారతీయ గొప్పదనాన్ని ధైర్యంగా, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. దీని గురించి మాట్లాడేటప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదని అన్నారు. ఎవరేమనుకుంటారోననే సంకోచాన్ని, బానిస భావాలను వీడనాడాలని మోదీ సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version