PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారం మరింత జోరందుకోనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. ప్రచార హోరును పెంచింది. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పరేడ్‌గ్రౌండ్ లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగ సభ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరుతారు. ప్రధాని 5 నుంచి 5:45 వరకు మోదీ సభలో మాట్లాడతారు. సాయంత్రం 5.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం అనంతరం 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
కీలక ప్రకటన చేసే ఛాన్స్..
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఇక, మాదిగ ఉప కులాల (మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి. అయితే, పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు నిర్వహించనున్న మాదిగ–ఉపకులాల విశ్వరూప సభకు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా భావిస్తోంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరుగనున్నది. ఇక, తమను కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సభకు దూరంగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పలువురు దళిత నేతలు భావిస్తున్నారు. అలా కాదని సభలో పాల్గొంటే మాల సామాజికవర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు చెబుతున్నారు.
వర్గీకరణకు మద్దతు ఇచ్చే పార్టీకే ఓటు..
ఇదిలా ఉండగా, నవంబర్ 30 లోపు ఏ పార్టీ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలుస్తుందో.. ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభల్లో చెప్పే మాటలు తమకు కడుపు నింపవని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని కలుపుకుని ప్రధాని మోదీ దగ్గరికి వెళ్లి ప్రస్తావించానని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఆ అంశాన్ని పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో అమలుకాని హామీ..
కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మేనిఫెస్టోలో మొదటి అంశం ఎస్సీ వర్గీకరణ పెట్టారు.. ఇప్పటి వరకు ఆచరించిన దాఖలాలు లేవని మందకృష్ణ ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేంద్రంలోని ప్రధాన పార్టీలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారే తప్ప.. ఆచరణలో పెట్టడం లేదని మండిపడ్డారు. డీకే.శివకుమార్ కర్ణాటకలో హామీల అంశాల గురించి ఇక్కడ మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పలుమార్లు ఈ విషయం గురించి ప్రస్తావించామని తెలిపారు.