Ayodhya Ram Mandir : అయోధ్య లోని రామాలయ ప్రారంభం, రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠిన దీక్ష పాటిస్తున్నారు. ఈనెల 12 నుంచి ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. దీక్షలో భాగంగా యం నియమం పాటిస్తున్నారు. ఈ నియమ ప్రకారం సూర్యోదయానికి ముందుగానే నరేంద్ర మోడీ నిద్రలేస్తున్నారు. లేచిన వెంటనే కాలకృత్యాల్ని తీర్చుకొని ధ్యానం చేస్తున్నారు. ఆ తర్వాత యోగాసనాలు వేస్తున్నారు. స్నానం చేసి కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతున్నారు. కఠినమైన తపస్సు చేస్తున్నారు.. కేవలం కొబ్బరి నీరు మాత్రమే తాగుతూ నిరంతరాయంగా పర్యటనలు చేస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభం పురస్కరించుకొని దేశంలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోడీ వయసు ప్రస్తుతం ఏడుపదులు దాటింది. అయినప్పటికీ ఆయన ఇటువంటి కఠిన ఉపవాస దీక్షలు చేస్తుండడం విశేషం.
నరేంద్ర మోడీ ఇప్పుడు మాత్రమే కాదు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కూడా కఠినమైన ఉపవాస దీక్ష పాటిస్తారు. నేలపై మాత్రమే నిద్రిస్తారు. చన్నీళ్ళతో స్నానం చేస్తారు. ఎటువంటి ఘన ఆహార పదార్థాలను ముట్టుకోరు. కేవలం నిమ్మరసం మాత్రమే తాగుతారు. అందులోను పంచదార అస్సలు వేసుకోరు.. గతంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమెరికా వెళ్లాల్సి వచ్చినప్పుడు మోడీ అక్కడ కూడా ఇలానే కఠిన ఉపవాస దీక్ష పాటించారు. ప్రోటోకాల్ ప్రకారం అతీరథ మహారధులతో కలిసి వైన్ తాగాల్సి వచ్చినప్పుడు.. నిర్మొహమాటంగా దానిని పక్కన పెట్టారు. అంతటి అమెరికాలో కూడా దుర్గాదేవికి పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని చెప్పుకోవడంలో మోడీ దాపరికం ప్రదర్శించలేదు. పైగా తాను దుర్గాదేవి ఉపాసనలో ఉన్నానని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ ఆ విధంగా ప్రకటించారో.. చాలామంది సామాజిక మాధ్యమాల వేదికగా తాము దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్నామని ఫోటోలు షేర్ చేశారు. ట్విట్టర్లో అయితే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల పేరుతో ట్రెండ్ చేశారు.
అయోధ్యలో జనవరి 22న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో నరేంద్ర మోడీ ఉపవాస దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న దీక్షను కూడా చాలామంది పాటిస్తున్నారు. అదే విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్రాంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లాకు మాత్రమే ప్రత్యేకమైన పుంగనూరు ఆవులకు గ్రాసం తినిపించారు. అయితే చాలామంది అది సంక్రాంతి వేడుకల్లో భాగమని అనుకున్నారు. కానీ ఒక మహత్కార్యంలో పాల్గొనే ముందు గోవులకు సేవ చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే నరేంద్ర మోడీ పుంగనూరు ఆవులను ఎంచుకున్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆవులకు గ్రాసం, దాణా తినిపించారు. మోడీ ఉపవాసదీక్ష చేస్తున్న నేపథ్యంలో యం నియమం సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన అంశంగా నిలిచింది. కొద్దిరోజులుగా ట్విట్టర్ ఎక్స్ లో దీని గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు.