Maoists: తుపాకులతోనే సమ సమాజం సాధ్యమని.. ఉద్యమంతోనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని.. అడవిలో ఉంటూ సమాంతర పాలన చేయొచ్చని నమ్మారు మావోయిస్టులు. అందువల్లే దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమం హింసాయుతంగా ఉండడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని సందర్భాలలో రాష్ట్రాలు, మావోయిస్టుల మధ్య యుద్ధం భీకరంగా సాగింది. రాజకీయ నాయకులు మావోస్టుల తూటాలకు బలైపోయారు. అటు ప్రభుత్వాలు కూడా మావోయిస్టుల మీద నిషేధం ప్రకటించడంతో నిత్యం రావణ కాష్టం కొనసాగుతూనే ఉంది. మధ్యలో శాంతియుత చర్చలు అనే అంశం తెరపైకి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత కొత్త కాలానికి మళ్లీ మావోయిస్టుల మీద ప్రభుత్వాలు యుద్ధం మొదలుపెట్టాయి. అటు మావోయిస్టులు కూడా సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ తమ ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టారు.
అడవుల్లో పాగా వేసిన మావోయిస్టులను తుద ముట్టించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ మొదలు పెట్టింది. అడవులలో అన్నలను ఏరిపారేయడం ప్రారంభించింది. కేంద్ర బలగాలు అడవుల్లోకి ప్రవేశించి మావోయిస్టుల ఆను పానుల మీద దెబ్బ కొట్టడం మొదలుపెట్టింది.. తెలంగాణలోని కర్రెగుట్టల నుంచి మొదలుపెడితే చత్తీస్ గడ్ ప్రాంతంలోని దండకారణ్యం వరకు మావోయిస్టులపై కేంద్ర బలగాలు ఉక్కు పాదం మోపాయి. కీలక నాయకులను అంతం చేశాయి. సాధ్యమైనంత వరకు అడవుల్లో అన్నల ప్రస్తావన లేకుండా చూడాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందువల్లే కేంద్ర బలగాలతోనే ఆపరేషన్ కగార్ ను మొదలుపెట్టింది. అంతేకాదు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చేయడాది మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. ఆయన చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే కేంద్ర బలగాలు మావోయిస్టులను సాధ్యమైనంత వరకు తుద ముట్టించుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల నుంచి ఒక కీలక ప్రకటన విడుదలైంది.
ఇప్పటివరకు మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేస్తూనే ఉంది. అత్యంత అధునాతనమైన వ్యవస్థలను ఉపయోగించుకొని మావోయిస్టుల మీద యుద్ధం చేస్తోంది కేంద్రం. తుపాకులు, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో మావోయిస్టులను అంతం చేసింది. కేంద్రం చేపట్టిన పహర్ వల్ల ఎంతో మంది మావోయిస్టులు చనిపోయారు. ఇంకా చనిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర బలగాలు అడవులలోకి మరిత లోతుగా వెళ్ళిపోతున్నాయి. కేంద్ర బలగాలు అడవుల్లోకి మరింతగా వస్తే ఎంతటి ప్రమాదమో మావోయిస్టులకు తెలుసు. అందువల్లే ఆపరేషన్ కగార్ ను నిలిపివేస్తే.. ఎన్ కౌంటర్లు ఆపి వేస్తే తాము ఆయుధాలను వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోం శాఖ మంత్రి కి ఏకంగా లేఖ రాశారు. సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరు మీద ఈ లేఖ విడుదలైనట్టు తెలుస్తోంది.