Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు సన్నాహం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా లోక్ సభ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 18వ లోక్ సభ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.
అయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రోజు నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. గతసారి కూడా తొలి దశలోనే ఏపీ ఎన్నికలు పూర్తి కావడంతోనే ఈ తరహా ప్రచారానికి కారణం అవుతోంది. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఈసారి మాత్రం ఆరు రోజులు ఆలస్యంగా విడుదలవుతోంది. దాని ప్రకారం షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీలకు మధ్య కూడా ఆ మేరకు తేడా ఉండే అవకాశం ఉంది. గతసారి ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 11 తో తొలిదశ మొదలు కాగా.. మే 19తో చివరి దశ ముగిసింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.
అయితే ఈసారి ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. 2004, 2009 ఉమ్మడి ఏపీలో ఎన్నికలు తొలి, మలి విడతల్లో జరిగాయి. 2014లో మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 7, 8 దశల్లో జరిగాయి. 2004లో నాలుగు దశల్లో, 2009లో ఐదు దశల్లో, 2014లో 9 దశల్లో, 2019లో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈసారి ఎన్ని దశల్లో పోలింగ్ జరుగుతుందో చూడాలి. అందులో ఏపీకి ఎప్పుడు నిర్వహిస్తారో అన్నది తెలియాల్సి ఉంది. తొలివిడతలో మాత్రం నిర్వహిస్తారని అనుకుంటే.. ఏప్రిల్ 11న పోలింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.