Voters List: దేశంలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే 102 నియోజకవర్గాలకు మార్చి 20న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 వరకు 18 ఏళ్లు నిండే అభ్యర్థులు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మహిళా ఓటర్లే ఎక్కువ..
ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో 1.89 కోట్ల మంది తొలిసారి ఓటు వేయనున్నట్లు ఈసీ తెలిపింది. మరోవైపు ఓటర్లలో మహిళల భాగస్వామ్యం కూడా పెరిగింది. దేశంలో మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు ఉన్నారు. 18–19 ఏళ్ల మధ్య 85.3 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
నాలుగు రాష్ట్రాల్లో 28 లక్షల మహిళా ఓటర్ల తొలగింపు..
ఇదిలా ఉండగా, కేంద్ర ఎన్నిలసంఘం పార్లమెంటు ఎన్నికల వేళ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 28 లక్షల మహిళా ఓటర్లను ఈసీ తొలగించింది. వీరంతా సరైన వివరాలు చెప్పని కారణంగానే తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంటి యజమాని పేరు స్థానంలో ఫలానా వ్యక్తి భార్యను.. ఫలాన వ్యక్తి కూతురును అని చెప్పారట. పాత సంప్రదాయం ప్రకారం చాలా మంది భర్త పేరు చెప్పలేదట. దీంతో ఎన్నికల సంఘం ఇలా వివరాలు వెల్లడించని 28 లక్షల మహిళల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించింది.
పారదర్శకత కోసమే..
ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే లక్షలాది డబుల్ ఓటర్లను తొలగించింది. ఈ క్రమంలో తాజాగా సరైన వివరాలు లేని ఓటర్ల పేర్లను కూడా తొగిస్తోంది. ఇందులో భాగంగానే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 28 లక్షల పేర్లను తొలగించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.