దేశంలో కరోనా రక్కసి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలను మళ్లీ ఠారెత్తిస్తోంది. ఓ వైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నడుస్తున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు.. ఏప్రిల్ రెండో వారంలో పీక్స్‌కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు ప్రభుత్వాలు సైతం కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి. విపరీతంగా పెరుగుతున్న కేసులతో మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి . సెప్టెంబర్ 20న 92,605 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత ఇన్ని అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే ఫస్ట్‌టైమ్.
భారతదేశం 89,129 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేయడంతో.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 1, 23,92,260 కు చేరుకుంది. ఇందులో 44,213 క్రియాశీల కేసులు, 44,202 రికవరీలు, 714 మరణాలు ఉన్నాయి. మరణాల సంఖ్య 1, 64,110 కు పెరిగింది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. నిన్న అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ కరోనా నియంత్రణ చర్యలపై పలు సూచనలు చేసింది.
మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, కేరళ, ఛత్తీస్ గడ్, చండీ గడ్ , గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, హర్యానాలో పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేంద్రం వెల్లడించింది. దేశంలో 90 శాతం కేసులు, మరణాలు ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని పేర్కొంది. భారతదేశంలో అత్యధికంగా కరోనా రక్కసి చేతిలో చిక్కి విలవిలలాడుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. కోవిడ్-19 నుంచి ఇప్పటివరకు తీవ్రంగా నష్టపోయిన మహారాష్ట్రలో నిన్న 47,827 కొత్త కేసులు నమోదయ్యాయి .
మార్చి 2020లో భారతదేశంలో మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు గత 24 గంటల్లో నమోదైన కేసులే రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం . గత 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తో 202 మంది చనిపోయారు. రాష్ట్ర రాజధాని ముంబైలో 24 గంటల వ్యవధిలో 8,648 కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ కేసుల పెరుగుదల కొనసాగితే మహారాష్ట్రలో లాక్ డౌన్ పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శుక్రవారం చెప్పారు. మరోవైపు.. పూణే నగరంలో నైట్ కర్ఫ్యూ విధించారు. వారం రోజులపాటు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. అటు ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుదల ఆందోళనకరంగా మారింది. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 3,594 కరోనా కేసులు నమోదయ్యాయి.